సినిమా హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు అందం చూసి తోటి హీరోలు సైతం కుళ్లుకుంటారు. చాలా మంది హీరోలు పలు సందర్భాల్లో మహేష్ అందాన్ని పొగిడిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబుకు అంతకంటే అందమైన మనసు ఉంది. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లకు ఆర్థిక సాయం చేస్తూ.. వారికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆఖరికి తండ్రి చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న సమయంలో కూడా మహేష్ బాబు.. ఓ చిన్నారికి హార్ట్ సర్జరీ చేయించి.. గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబు మంచిమనసుకు సంబంధించి మరో వార్త వెలుగు చూసింది.
మహేష్ బాబు తండ్రి కృష్ణ కొన్ని రోజు క్రితం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరి.. చికిత్స తీసుకుంటూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంలోనే మహేష్ బాబు తనకు ఎంతో ఆత్మీయుడైన అన్న రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ ముగ్గురు.. ఇదే ఏడాది మృతి చెంది.. తీరని విషాదం మిగిల్చారు. ఈ బాధ నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు. ఇంతటి విషాదంలోనూ సమాజ సేవ గురించి ఆలోచించడం మానలేదు. తాజాగా మరో చిన్నారి గుండె ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేసి.. ఆ చిన్నారికి పునర్జన్మను ప్రసాదంచాడు మహేష్ బాబు. ఆ వివరాలు..
తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు మహేష్ బాబు దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన మహేష్.. సదరు చిన్నారికి ఆర్ధిక సహాయం చేయడంతో పాటు ఉచితంగా ఆపరేషన్ చేయించాడు. జిల్లాలోని జైనథ్ మండలంలోని గూడా సిర్సన్న గ్రామానికి చెందిన 10 నెలల చిన్నారి కనకాల వర్ష పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. కానీ చిన్నారికి వైద్యం చేయించేంత ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేదు. దాంతో బిడ్డను బతికించుకోవడం కోసం దాతల సహాయాన్ని కోరుతున్నారు. చిన్నారికి వచ్చిన సమస్య గురించి తెలుసుకున్న.. ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ పాశం రాఘవేంద్ర సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఈ నేపథ్యంలోని చిన్నారి సమస్య గురించి.. హైదరాబాద్‌లోని ఎంప్లాయ్ హెల్త్ స్కీం అధికారి సురేష్ దృష్టికి తీసుకెళ్లాడు రాఘవేంద్ర. సురేష్ చిన్నారిని నగరంలోని స్టార్ హాస్పిటల్‌లో చేర్పించాడు. స్టార్ హాస్పిటల్ ద్వారా ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మహేష్ బాబు.. తన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫాండేషన్ ద్వారా రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేశాడు. చిన్నారికి విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన మహేష్ బాబుకి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అలానే ఈ సమస్యను మహేష్ బాబు దృష్టికి తీసుకెళ్లడంలో తమకు సహకరించిన సురేష్, రాఘవేంద్రకు కూడా తాము జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.
ఇక మహేష్ బాబు.. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేసన్ ద్వారా.. ఇప్పటివరకు సుమారు వెయ్యికిపైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణాలు కాపాడాడు. తాజాగా మరో చిన్నారి వైద్యానికి సాయం చేయడంతో మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.