గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సింగర్.. గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూసిన విషాదం నుంచి కోలుకోక ముందు ప్రముఖ నటుడు కన్నుమూయడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఒకప్పుడు బుల్లితెరపై సెన్సేషన్ సృష్టించిన మహాభారతం సీరియల్ లో భీముని పాత్రలో కనిపించిన ప్రవీణ్ కుమార్ సోబ్తీ గుండెపోటుతో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ప్రవీణ్ కుమార్తె నికునిక ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తండ్రి మరణించాడని తెలిపారు. ఆయనకు గుండెపోటు వచ్చింది. ఢిల్లీలోని ఇంట్లోనే చనిపోయారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కేవలం బుల్లి తెర నటుడిగానే కాకుండా అమితాబ్ షెహన్ షా, ధర్మేంద్ర లోహాతో పాటు ఆజ్ కా అర్జున్, అజూబా, ఘాయల్ తదితర చిత్రాలలో ప్రవీణ్ కుమార్ సోబ్తీ కీలక పాత్రలు పోషించారు. తెలుగు లో కమల్ హాసన్ తో కూడా నటించాడు. ఇండస్ట్రీకి రాకముందు ప్రవీణ్ కుమార్ డిస్క్ త్రో క్రీడాకారుడిగా ఆయన రాణించారు. నాలుగు సార్లు ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ సాధించారు.
ఇది చదవండి: సహజనటి జయసుధకు కరోనా పాజిటివ్..!
భారత్ తరఫున 1968, 1972 లలో ఒలింపిక్స్ గేమ్స్ లోనూ పాల్గొన్నారు. క్రీడాకారుడిగా అర్జున అవార్డును కూడా అందుకున్నారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)లో డిప్యూటీ కమాండెంట్‌గా కూడా పనిచేశారు. నటుడిగానూ నిరూపించుకున్నారు ప్రవీణ్. 50 కంటే ఎక్కువ హిందీ చిత్రాలలో నటించాడు. ఆయన మృతికి ఇండస్ట్రీ సెలబ్రెటీలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.