ఈ మధ్యకాలంలో ఏ సినిమా థియేట్రికల్ రిలీజైనా నెల, రెండు నెలలకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. చిన్న సినిమాల దగ్గరనుండి పాన్ ఇండియా సినిమాల వరకూ అందరి సినిమాలు ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. కానీ.. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు మాత్రం ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసిన విధంగా ఓటిటిలోకి రాకుండా ఆశ్చర్యపరుస్తుంటాయి. థియేటర్లో విడుదలై మూడు నెలలు దాటినా ఇంకా ఎలాంటి ఊసే లేని సినిమా ‘మాచెర్ల నియోజకవర్గం’. నితిన్ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. ఆగష్టు 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరిచింది. దీంతో సినిమా ఎలాగో ఓటిటిలోకి వస్తుందని అంతా ఎక్సపెక్ట్ చేశారు ఫ్యాన్స్.
ఈ క్రమంలో ఇన్ని రోజులైనా సినిమా ఓటిటిలోకి రాకపోగా.. నేరుగా టీవీ ఛానల్ లో ప్రీమియర్ కాబోతున్నట్లుగా ప్రకటన రావడం గమనార్హం. మాచెర్ల నియోజకవర్గం హిందీ వెర్షన్ ని సోనీమ్యాక్స్ ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ ని కూడా మాచెర్ల నియోజకవర్గం నుండి ‘మాచెర్ల చునావ్ క్షేత్ర’ అని మార్చడం విశేషం. అయితే.. సోనీ మ్యాక్స్ ఛానల్ లో ఈ సినిమా డిసెంబర్ 11న, రాత్రి 8 గంటలకు ప్రదర్శించనున్నట్లు సమాచారం. తాజాగా దీనికి సంబంధించి హిందీ ప్రోమో కూడా రిలీజ్ చేశారు సోనీ మ్యాక్స్ వారు. ప్రస్తుతం మాచెర్ల చునావ్ క్షేత్ర ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు నితిన్ అభిమానులు. మరోవైపు ఈ సినిమా ఓటిటిలోకి రాకుండానే హిందీ వెర్షన్ సోనీ మ్యాక్స్ లో ప్రీమియర్ కాబోతుంది. మరి ఇప్పటికైనా మేకర్స్ మాచెర్ల నియోజకవర్గం మూవీకి ఓటిటి ప్లాట్ ఫామ్, స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించగా.. శ్రేష్థ్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. చూడాలి మరి మాచెర్ల చునావ్ క్షేత్ర.. హిందీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోనుందో!