ఇటీవల కాలంలో మహిళా లిరిసిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు శ్రేష్ట. ఓ రొమాంటిక్ క్రైమ్ కథతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన ఆమె.. అనతికాలంలోనే మంచి గేయరచయితగా పేరు గడించింది. గతంలో సినిమా పరిశ్రమపై తీవ్ర అరోపణలు చేసిన ఆమె.. ఇప్పుడు ఓ పోస్టుతో కలకలమే రేపింది.
టాలీవుడ్‌లో అనేక మంది గేయ రచయితలు ఉన్నారు. అయితే మహిళా లిరిసిస్టులు అరుదు. ఇటీవల కాలంలో మహిళా లిరిసిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరు శ్రేష్ట. ఓ రొమాంటిక్ క్రైమ్ కథతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన ఆమె.. అనతికాలంలోనే మంచి గేయరచయితగా పేరు గడించింది. బంగారు కొండ (కో అంటే కోటి), కొరిబాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలకు పని చేసింది. అయితే ఆమెకు గుర్తింపును తెచ్చింది మాత్రం పెళ్లి చూపులు సినిమాతో. అందులో చినుకుతాకే జడిలో, మెరిసే మెరిసే అనే పాటలను రాసింది. అర్జున్ రెడ్డిలో మధురమే ఈ క్షణమేతో పాటు మరో పాటకు తన కలాన్ని అందించింది. ఆ తర్వాత యుద్ధం శరణం గచ్చామీ, హలోతో పాటు పలు సినిమాలకు పాటలను అందించింది.
అయితే సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని..తాను వేధింపులకు గురయ్యానంటూ గతంలో ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది ఈ గేయ రచయిత. తాజాగా మరోసారి సినిమా పరిశ్రమపై, అందులోని ప్రముఖ వ్యక్తులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ పోస్టు చేసింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ తాను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే కారణం వాళ్ళేనంటూ శేఖర్ కమ్ముల, సుకుమార్, నందిని రెడ్డి, యండమూరి వీరేంద్రనాథ్, రామజోగయ్య శాస్త్రి,లక్ష్మీ భూపాల్ సహా పలువురు ప్రముఖుల పేర్లను సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. తనను సినీ పరిశ్రమలో కొంత మంది టార్గెట్ చేశారని, మైండ్ గేమ్స్ ఆడారని, మానవ అక్రమ రవాణా ఉచ్చులోకి తనను లాగేందుకు ప్రయత్నించారని, ఎలా అయినా శ్రేష్ఠని అందులోకి లాగేందుకూ, కుదరకపోతే చంపేందుకూ, అందుకూ అవకాశం దొరకకపోతే తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని చచ్చేందుకూ ప్రయత్నాలు చేశారంటూ.. తాను చనిపోతే 2013-16 మధ్య కొంత మంది కాల్ డేటా, వాట్సప్ డేటాలు పరిశీలించాలని పేర్కొంది.
‘ప్రస్తుతం, గతంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో తన జీవితాన్ని, తన కెరీర్‌ను దెబ్బకొడుతున్న వాళ్లు, గతంలో నేను ఇండస్ట్రీతో పాటు హైదరాబాద్ వదిలి కొన్నాళ్ళు ఆత్మరక్షణ కోసం ఇంటి దారి పట్టడానికి కారణమయిన వాళ్ళు వీరంటూ మరో ప్రముఖుల పేర్లను పేర్కొంది శ్రేష్ట. ఒక ఆడదాన్ని టార్గెట్ చేసి, ఐసొలేట్ చేసి, నానా రకాలుగా పీడించి చంపడం లేదా.. తనకు తానుగా ఆత్మహత్య చేసుకుని చచ్చేలా చేయడం చాలా మందికి వెన్నతో పెట్టిన విద్య! వాళ్ళ పగకు పెద్ద కారణమేమీ ఉండదు. ఓ స్త్రీ కొద్దో గొప్పో సంస్కారంగా కనిపిస్తే చాలు, తన విలువలు కాపాడుకుంటూ బ్రతికే వ్యక్తిత్వంతో ఉంటే చాలు..బస్ అంతే! ఎలా చెడగొట్టాలి? ఎలా చెరచాలి? ఎంతకీ వాళ్ళ పన్నాగాలు ఫలించకపోతే..ఎలా చంపాలి? ఎలా చచ్చేలా చేయాలి?’చూస్తున్నారని పేర్కొంది. అయితే ఆమె చేస్తున్న ఈ తీవ్ర ఆరోపణల పోస్టు వైరల్ గా మారింది. ఆమె ఈ ఆరోపణలు ఎందుకు చేస్తుందో తెలియరావడం లేదు. ఈ పోస్టు నిజమైనదో కాదో నిర్దారణ కావాల్సి ఉంది. సినిమా పరిశ్రమలో ముఖ్యంగా గేయ రచయితల్లో మేల్ డామినేషన్ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు అవకాశాలు రావడం లేదో లేక మళ్లీ ఫాంలోకి వచ్చేందుకు ఈ వ్యాఖ్యలు చేసిందో ఆమెనే స్పందించాల్సి ఉంది.