చిత్ర పరిశ్రమలో ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ఫట్ అవుతుందో చెప్పడం ఎవరితరం కాదు. భారీ అంచనాల నడుమ విడుదలైన భారీ మూవీలు డిజాస్టర్ గా నిలవొచ్చు. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వొచ్చు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతూ రిలీజ్ అయిన ‘లైగర్’ భారీ డిజాస్టర్ గా మిగిలిన విషయం మనందరికి తెలిసిందే. ఇక ఈ చిత్రం డిజాస్టర్ తో బయ్యర్లు సైతం డైరెక్టర్ పూరి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ ఓ కార్యక్రమంలో లైగర్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లైగర్ సినిమా తన జీవితంలో ఎంతో మార్పు తెచ్చిందని వెల్లడించాడు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన లైగర్.. పాన్ ఇండియా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో భారీ నష్టాలను చవిచూశారు నిర్మాతలు ఛార్మి, పూరీలు. అదీ గాక డిస్టిబ్యూటర్లు అందరు పూరీ ఇంటి ముందు ధర్నాకు దిగుతాం అని పిలుపివ్వడం, పూరీ ఆడియో లీక్ అవ్వడం వంటి సంఘటనలు పెద్ద ఎత్తున దూమారం లేపాయి. సినిమా ఫ్లాప్ అయినప్పటి నుంచి చిత్ర యూనిట్ బయట కనిపించడం మానేసింది. విజయ్ అయితే మూవీ ఫంక్షన్స్ కు వెళ్లడం తగ్గించేశాడు.
తాజాగా ఓ ఇంటర్య్వూలో లైగర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్.”లైగర్ సినిమా రిజల్ట్ నన్ను నాకు చూపించింది. ఒక నటుడిగా ఒక మనిషిగా ఎలా ఉండాలో నేర్పింది. ఈ సినిమా తర్వాత నేనేం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అన్న పాఠాలను నేర్పింది. నా జీవితంలో లైగర్ సినిమా ద్వారా అత్యంత విలువైన గుణపాఠాన్ని నేర్చుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. అయితే ఒక నటుడు అపజయాల నుంచి పాఠాలు నేర్చుకునే విజయాలు సాధించాలి. గతంలో చేసిన తప్పులు తెలుసుకుని వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకున్నప్పుడే మనిషికి విలువ పెరుగుతుంది. ఇప్పటికైనా విజయ్ రియలైజ్ అయినందుకు అతడి అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక విజయ్ ఎప్పుడెప్పుడు బయట కనిపిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.