తెలుగు ఇండస్ట్రీలో తమ అద్భుతమైన నటనతో కోట్లాది ప్రేక్షకులను మెప్పించిన వారిలో మహానటి సావిత్రి ఒకరు. ఎలాంటి సన్నివేశమైనా సింగిల్ టేక్ తోనే పూర్తి చేయడం.. కేవలం కళ్లతోనే చక్కటి హవభావాన్ని ప్రదర్శించడం ఆమెకే సొంతం. కేవలం నటిగానే కాకుండా దర్శక, నిర్మాతగా తెలుగు తెరపై ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ కాలం నటీమణులు ఇండస్ట్రీలో మీకు ఎవరు ఇష్టం అంటే వెంటనే మహానటి సావిత్రి పేరు చెబుతారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటిగా ప్రేక్షకుల గుండెలో సుస్థిరమైన స్థానం సంపాదించారు సావిత్రి. అంతగొప్ప అభినేత్రి తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు.. కష్టాలు అనుభవించారు.
సావిత్రి చిన్ననాటి నుంచి ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె నాటకం చూసి మెచ్చుకున్న ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు వెండితెరపై ఛాన్సు ఇచ్చారు. కానీ ఆమె కెమెరా ముందు సరిగా నటించలేక తొలి అవకాశం వదులుకున్నారు. ఆ తర్వాత కే.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాలభైరవి చిత్రంలో తన డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘దేవదాసు’ చిత్రంలో సావిత్రి నటించిన పార్వతి పాత్రలకు ఎంతో గొప్ప పేరు వచ్చింది. 1953 జూన్ 26 న విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంది.
తెలుగులో మహానటులు యన్టీఆర్, ఏఎన్ఆర్ లతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు సావిత్రి. అటు తమిళనాట ఎంజీఆర్, శివాజీ గణేష్ లాంటి స్టార్ నటులతో కలిసి నటించి ఎంతో గొప్ప పేరు సంపాదించారు. తెలుగు చిత్ర పరిశ్రమ పుట్టినిళ్లు అయితే.. తమిళ చిత్ర పరిశ్ర మెట్టినిళ్లు అని సావిత్రి అనేవారు. మహానటి సావిత్రి తెలుగులోనే కాదు.. తమిళ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. బాలీవుడ్ లో సైతం ఆమె చెరగని ముద్ర వేసింది. అప్పట్లో సావిత్రి కాల్ షీట్స్ కోసం స్టార్ హీరోలు ఎదురు చూసేవారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సావిత్రి ఉంటే ఆ సినిమా హిట్ గ్యారెంటీ అనే స్థాయికి ఎదిగింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు జెమిని గణేష్ ని ప్రేమించి 1952 లో రహస్యంగా పెళ్లి చేసుకుంది. జెమినీ గణేష్ ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె జీవితంలో ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి.
సావిత్రి జీవితం ఎంతగొప్పగా వెలిగిపోయిందో.. చివరి రోజుల్లో అన్ని కష్టాలు అనుభవించారని ఇండస్ట్రీ టాక్. కానీ, అందరూ అనుకుంటున్నట్లు ఆమె చనిపోయే ముందు దుర్భరమైన జీవితం అనుభవించలేదని కుటుంబ సభ్యులు చెబుతారు. సావిత్రి కి సంబంధించి ఎన్నో ఆస్తులు ఆమె కూతురు విజయచాముండేశ్వరి.. కొడుకు సతీష్ కుమార్ లకు దక్కింది. ఇక సావిత్రి చనిపోయే నాటికి ఆమెకు సినీ ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి సహాయం కానీ.. సానుభూతి కానీ లభించలేదని ఫిలిమ్ వర్గాల్లో టాక్. దీనికి గల కారణం సావిత్రి మొండి వైఖరే అంటారు.
తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజ నటులు యన్టీఆర్, ఏఎన్ఆర్ లు సావిత్రికి ఎన్నో సార్లు ఆమె వ్యసనాలు మానివేయాలని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సలహా ఇచ్చారట.. కానీ ఆమె మాత్రం తన మొండి వైఖరితో వారి మాటలు వినకపోవడం వల్లనే చివరి రోజుల్లో పెద్దగా పట్టించుకోలేదని ఫిలిమ్ వర్గాల్లో టాక్. యన్టీఆర్, ఏఎన్ఆర్ లు మాత్రమే కాదు.. సహ నటీమణులు కూడా సావిత్రికి తన వ్యసనాలు మానివేయాలని చెప్పిచూశారట.. కానీ ఎవరి మాటలు వినకపోవడంతో చనిపోయే ముందు ఎవరూ రాలేదని.. కనీసం చూడలేదని అంటారు.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’చిత్రంలో సావిత్రి చివరి జీవితంలో అనుభవించిన కష్టాలు.. మద్యానికి బానిసైన విషయం కొంత వరకు మాత్రమే ప్రస్తావించారు. కానీ సావిత్రి నిజ జీవితంలో ఆమె వ్యసనాలకు పూర్తి భానిస అయి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలై కష్టాలు అనుభించారని ఆమెను అభిమానించేవారు.. సన్నిహితులు అంటారు. ఇండస్ట్రీలో సావిత్రి నటన పరంగా ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకున్నప్పటికీ.. ఆమె నిజ జీవితంలో పడ్డ కష్టాలు ఎవరికీ రావొద్దని అంటారు.