తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు(83) కన్ను మూశారు. అనారోగ్యంతో ఆయన ఇవాళ తెల్లవారుజామున 3.25 నిమిషాలకు హాస్పిటల్ లో చికిత్స పొందుతో కన్ను మూశారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న ప్రభాస్ హాస్పిటల్ లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. కృష్ణం రాజు హాస్పిటల్ లో చేరారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలని నిజం చేస్తూ ఆయన అనారోగ్యంతో పోరాడుతూ ఇవాళ కన్ను మూశారు. కృష్ణం రాజు మరణ వార్తతో అటు ప్రభాస్ కుటుంబం, ఇటు సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. కృష్ణం రాజు మృతితో ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
నెల రోజుల క్రితం కోవిడ్ బారిన పడ్డ ఆయన.. ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే కోవిడ్ నుంచి కోలుకోలేకపోయారు. తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. 1940 జనవరి 20వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన ఆయన 180కి పైగా సినిమాల్లో నటించారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చివరి సారిగా ఆయన నటించిన సినిమా రాధే శ్యామ్. మరి.. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.