Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య శ్యామలా దేవి.. భర్త భౌతికఖాయాన్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. గుండె లవిసేలా కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక, కృష్ణంరాజు, శ్యామలా దేవిల మధ్య కేవలం భార్యాభర్తల సంబంధం మాత్రమే కాదు.. అంతకు మించిన అనుబంధం కూడా ఉంది. కృష్ణంరాజు మొదటి భార్య సీతా దేవి 1995లో కారు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. కొన్ని నెలల పాటు నరకవేదనను అనుభవించారు. ఈ నేపథ్యంలోనే 1996లో శ్యామలా దేవితో ఆయనకు రెండో వివాహం జరిగింది.
ఈ పెళ్లి విషయంలో కృష్ణంరాజు తనవైపునుంచే కాదు.. కాబోయే భార్య వైపు నుంచి కూడా ఆలోచించారు. శ్యామలా దేవికి ఈ పెళ్లి ఇష్టమా లేదా?.. పెద్దల బలవంతంతో పెళ్లికి ఒప్పుకుందా? అని తెలుసుకోవటానికి ఆమె దగ్గరకు మనిషిని పంపారు. ఆమెకు ఇష్టమే అని తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. శ్యామలా దేవితో పెళ్లి తర్వాత కృష్ణంరాజులో చాలా మార్పు వచ్చింది. ఆమె కృష్ణంరాజుకు అన్ని రకాలుగా తోడుగా నిలిచింది. ముఖ్యంగా మానసిక ఇబ్బందుల సమయంలో కొండంత అండగా నిలిచింది. భర్త చేసే పనుల్లో ఆమె స్వయంగా పాలు పంచుకునేది.
కృష్ణంరాజుకు తన తోటి నటీనటులకు ఇంటినుంచి సెట్‌కు భోజనం తీసుకెళ్లటం అలవాటు. సెట్‌లో అందరికీ భోజనం కొసరికొసరి వడ్డించేవారు. శ్యామలా దేవి స్వయంగా ఇంట్లో వంట వండి నటీనటులకు పంపేది. కష్టనష్టాల్లో తోడుంటున్న భార్యకు కృష్ణంరాజు సముచిత స్థానం ఇచ్చేవారు. ఏ కార్యక్రమానికి వెళ్లిన శ్యామలా దేవిని వెంటబెట్టుకుని వెళ్లేవారు. ఇద్దరూ ఇండస్ట్రీ ఆది దంపతులుగా అనిపించేవారు. చాలా సమయాల్లో కృష్ణంరాజు తన భార్య గురించి గొప్పగా చెప్పారు. ‘‘నా భార్యే నాకు అతి పెద్ద బహుమతి’’ అనే వారు. ఇక దాంపత్య జీవితం గురించి ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి.
ఓ సందర్భంలో దాంపత్య జీవితం గురించి కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘‘ భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఆ సమయంలో మౌనంగా ఉంటే అన్నీ సర్థుకుంటాయి. దంపతుల మధ్య ఇగో ఉండకూడదు. చిన్న సమస్యను పెద్దగా చేసి చూడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే కాపురం సాఫీగా సాగుతుంది’’ అని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో శ్యామలా దేవి మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. దంపతుల మధ్య ఇగోలు ఉండకూడదని అన్నారు. మరి, కృష్ణంరాజు, శ్యామలా దేవి దాంపత్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pawan Kalyan: రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి!