టాలీవుడ్ సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి ఆయనకు స్వల్ప గుండెపోటు రావటంతో మహేష్ బాబు భార్య నమ్రత ఆయనను హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారు. కృష్ణకు కాంటినెంటల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స అందుతోంది. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే వైద్యులు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీనియర్ డాక్టర్ గురు.ఎన్.రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. 48 గంటలు గడిస్తే తప్ప.. ఏం చెప్పలేమని వెల్లడించారు. ఆయన కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా సూచించారు.
ఇక కృష్ణ అనారోగ్యం గురించి తెలియడంతో.. మహేష్ బాబు.. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులను కలిసి.. తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం మహేష్‌తో పాటు కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇక గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరిన కృష్ణకు సుమారు 20 నిమిషాల పాటు సీపీఆర్ చేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రతి గంట కీలకమేనని వెల్లడించారు. ఇక కృష్ణ త్వరగా కోలుకోవాలని.. ఆయన అభిమానులు, మహేష్‌బాబు అభిమానులు కోరుకుంటున్నారు.