నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. తీవ్ర అస్వస్థతతో సోమవారం ఉదయం గచ్చిబౌలీలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. పరిస్థితి విషమించడంతో.. మంగళవారం ఉదయం మృతి చెందారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబంలోనే కాక.. ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాదం అలుముకుంది. ఇక మహేష్ బాబును ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఏడాది వ్యవధిలోనే ఆయన తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయారు. ఈ ఏడాది మహేష్ బాబుకు ఏమాత్రం అచ్చి రాలేదు. తండ్రి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న మహేష్ బాబు.. ప్రస్తుతం కాంటినెంటల్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు. తండ్రి మృతదేహాన్ని చూసి మహేష్ బాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కృష్ణ మృతి చెందిన కాంటినెంటల్ ఆస్పత్రికి చేరుకుని… తండ్రిని కడసారి చూసుకున్నాడు. నమ్రత కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుంది. అలానే మరో అల్లుడు సుధీర్ బాబు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు.
ప్రస్తుతం కృష్ణ మృతదేహాన్ని నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం.. కృష్ణ మృతదేహాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. ప్రస్తుతం కృష్ణ ఇంటి వద్ద, గచ్చిబౌలి స్టేడియంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.