టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక లెజెండ్ ని కోల్పోయిన రోజు ఈరోజు. సాహసమే ఊపిరిగా, నిర్మాతల పాలిట హీరోగా, ట్రెండ్ సెట్టర్ గా జీవించిన సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం కారణంగా తెలుగు సినీ పరిశ్రమలో చీకట్లు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు నేడు దుర్దినంగా భావిస్తున్నారు. కృష్ణ పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని కృష్ణ నివాసంలో ఉంచారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రముఖుల నివాళుల తర్వాత పార్థివ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తరలించనున్నారు.
ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటల వరకూ అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియంలో ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వమే అంత్యక్రియలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కేసీఆర్ సూచనలు చేశారు.
దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
— Telangana CMO (@TelanganaCMO) November 15, 2022