సినీ ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పటికే అనేక మంది నట వారసులు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోల స్థాయికి ఎదిగారు. మరికొందరు అలా వచ్చి ఇలా కనుమరుగయ్యారు. కేవలం హీరో, హీరోయిన్ల వారసులే సినిమాలోకి ఎంట్రి ఇవ్వడంలేదు. హాస్యనటులు, దర్శకులు వంటి తదితరుల పిల్లలు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే అలా వచ్చిన వారసులు చాలా మంది తమదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించారు. ఇటీవలే బుల్లితెర మెగాస్టార్.. ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు జరుగుతున్నాయి. తాజాగా మరో నటుడి మనవడు హీరోగా వెండితెరకు పరిచయం కానున్నాడు. దివంగత హాస్య నటుడు చంద్రబాబు మనవడు హీరోగా కోలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
దివంగత హస్యనటుడు చంద్రబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమ ఎప్పటికీ మర్చిపోదు. అంతలా తనదైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు చంద్రబాబు. ఎన్నో చిత్రాల్లో నటించి..తమిళ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అందుకే చంద్రబాబును కోలీవుడ్ ఎప్పటికీ మరచిపోదు. కాగా ఆయన నట వారసత్వాన్ని మనవడు సారత్ తన భుజాలపై వేసుకున్నాడు. తాత నటనను పుణికి పుచ్చుకుని.. ఇండస్ట్రీలో విజయం సాధించేందుకు సారత్ ముందడుగు వేశాడు. తెర్కత్తివీరన్ అనే చిత్రంతో హీరోగా సారత్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. అయితే ఈ సినిమాకు కథ, మాటలు పాటలు, దర్శకత్వం, నిర్మాత అన్నీ తానే కావడం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. సారత్ ఇంతక ముందు ఎప్పుడూ ఏ దర్శకుడి వద్ద పనిచేసిన అనుభవం లేదు.
ఇక సినిమా విషయానికి వస్తే.. చంద్రబాబు ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శ్రీకాంత్ దేవా సంగీతాన్ని, ఎన్. షణ్ముఖ సుందరం చాయా గ్రహణను అందించారు. ఈ చిత్రంలో వేలా రామ్మూర్తి, రాజసింహన్ నమో నారాయణ , ఉమా పద్మనాభన్, రేణుక, మనోహర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. షూటింగ్ పనులు పూర్తి చేసుకుని చివరి దశలో ఉన్న ఈ సినిమా..డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లతో చిత్రబృందం బిజీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నటుడు సారత్..మూవీకి సంబంధించిన పలు విషయాలు తెలిపాడు. ఈ మూవీ తూత్తుకుడి లో జరిగిన యథార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు.