ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మోడలింగ్ రంగంలో మంచి పేరు సంపాదించి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించేవారు ఎంతో మంది ఉన్నారు. మోడలింగ్ రంగం నుంచి ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు. అయితే కొంత మంది మోడల్స్ తమకు సరైన పేరు రావడం లేదని, ఇండస్ట్రీలో ఛాన్సులు దొరకడం లేదని నిరుత్సాహంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక బెంగాలీ వినోదరంగానికి చెందిన నలుగురు మోడల్స్ 13 రోజుల వ్యవధిలో ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతున్నాయి.
ఇటీవలే బిదిషా సూసైడ్ చేసుకోగా.. ఆ తర్వాత ఆమె స్నేహితురాలు మంజూషా కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఆ తర్వాత మరో స్టార్ నటి, మోడల్ పల్లవి తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. వరుసగా జరుగుతున్న ఈ విషాదాలన్ని మరువక ముందే.. 18 ఏళ్ల యువ మోడల్ సరస్వతీ దాస్ తన గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. అది చూసిన ఆమె అమ్మమ్మ స్థానికుల సహాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సరస్వతి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
గత కొంత కాలంగా ఈ యంగ్ మోడల్ తన తండ్రికి దూరంగా ఉంటూ వస్తుంది. ప్రస్తుతం ఆమె తన తల్లి ఆరతి దాస్, మేనమామ లతో కలిసి ఉంటుంది. యంగ్ మోడల్ సరస్వతి దాస్ చనిపోయిన వార్త గురించి తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కి తరలించారు. ఆమె ఎలా చనిపోయింది అన్న విషయం గురించి తెలియాంటే పోస్ట్ మార్టం రిపోర్టు రావాలి అని పోలీసులు అంటున్నారు. కాకపోతే మోడల్ మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. ఇప్పటి వరకు 13 రోజుల్లో నలుగురు మోడల్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
ఆమె రాత్రి వరకు ఎవరెవరితో సంభాషించింది అన్న విషయంపై ఫోన్ కాల్స్ రికార్డింగ్ ద్వారా పరిశీలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. ఇప్పుడిప్పుడే మోడలింగ్ లో తనకంటూ ప్రత్యే స్థానం ఏర్పాటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. మోడలింగ్ లో తనకు సరైన సక్సెస్ రావడం లేదని.. గత కొన్ని రోజులుగా మానసిక బాధపడుతుందని అన్నారు. అయితే మానసిక వత్తడి వల్ల ఆత్మహత్య చేసుకుందా? లేక ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.