తమ హీరో బర్త్ డే వచ్చిందంటే అభిమానులు చేసే హడావుడి మామూలుగా ఉండదు. వారి హీరో ఫ్లేక్సీలు కట్టించడం అన్నదానాలు, పూజలు, రక్తదానాలు, కేక్ కటింగ్‌లు అబ్బో ఒకటేమిటి అలాఇలా ఉండదు ఫ్యాన్స్ సందడి. ఇవన్నీ చూసి, చేసి విసుగొచ్చిందేమో మరి మన కన్నడ స్టార్ కిచ్ సుదీప్ ఫ్యాన్స్‌కి. కాస్త భిన్నంగా, ఒకింత అత్యుత్సాహంతో ఏకంగా జంతువునే బలిచ్చారు.
సుదీప్ ఫ్లెక్సీ ఎదుట రోడ్డుపై ఓ దున్నపోతుని నరికి చంపారు. అంతటితో ఆగలేదు ఆ దున్నపోతు రక్తాన్ని తీసుకెళ్లి సుదీప్ ఫ్లెక్సీపై చల్లుతూ వేడుకలు చేసుకున్నారు. తమ హీరో సినిమాలు అన్నీ సూపర్ హిట్ కావాలని ఇలా చేశారంట. హీరో మీద అభిమానంతో నలుగురికి సహాయం చేస్తే మెచ్చుకుంటారు గానీ, ఇలా మూగజీవాన్ని హతమార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అలా చేసిన వారిని తప్పకుండా అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి, అభిమానుల ఈ షాకింగ్ యాక్షన్‌పై హీరో సుదీప్ ఎలా స్పందిస్తాడో చూడాలి.