కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా జంట వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్ లోని జైసల్మీర్ సమీపంలో ఉన్న సూర్య ఘడ్ రిసార్ట్ లో వీరి వివాహ వేడుక జరిగింది. ఫిబ్రవరి 7న అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు వేశారు. ముఖ్య అతిథులుగా షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ దంపతులు, కరణ్ జోహార్, ఈషా అంబానీ, ఆనంద్ పిరమల్ దంపతులు, జుహీ చావ్లా, జే మెహతా దంపతులు హాజరయ్యారు. కాగా ఢిల్లీ నుంచి పెళ్లి మేళం బృందం వివాహ వేదిక దగ్గరకు రాగా.. వరుడు సిద్దార్థ్ మల్హోత్రా సంప్రదాయబద్ధంగా తెల్లని గుర్రం మీద వచ్చారు. 2021లో వచ్చిన షేర్ షాహ్ సినిమాలో నటించిన ఈ జంట ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు.
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా షేర్ షాహ్ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. రెండేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. పేల్ పింక్ కలర్ లెహంగాలో కియారా తళుక్కుమని మెరవగా.. సిద్దార్థ్ మల్హోత్రా క్రీమ్ కలర్ షేర్వాణీలో పెళ్లి పీటల మీద కూర్చున్నారు. ఒకరినొకరు చూసుకుంటూ దండం పెట్టుకున్న ఫోటో, ఒకరినొకరు ముద్దాడుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇప్పుడు మా పర్మినెంట్ బుకింగ్ పూర్తయ్యింది. మా కొత్త ప్రయాణం కోసం మీ దీవెనలు, మీ ప్రేమ కావాలి’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త దంపతులిద్దరూ ఈరోజున ఫిబ్రవరి 8న ప్రైవేట్ జెట్ లో జైసల్మీర్ నుంచి ఢిల్లీలో ఉన్న సిద్దార్థ్ ఇంటికి వెళ్లనున్నారు.
అక్కడకు వెళ్ళాక సిద్దార్థ్ మల్హోత్రా ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఫిబ్రవరి 9న రిసెప్షన్ ఉంటుందని, స్నేహితులను, బంధువులను ఈ రిసెప్షన్ కు పిలుస్తారని వెల్లడించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 10న తిరిగి ముంబై చేరుకొని.. ఫిబ్రవరి 12న సినీ పరిశ్రమకు చెందిన స్నేహితుల కోసం గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాగా ఈ జంట ఒకటైన సందర్భంగా.. సమంత, ఉపాసన కొణిదెల, కత్రినా కైఫ్, అలియా భట్ సహా పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలియజేశారు. కాగా కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనూ నటిస్తోంది. మరి ఈ నూతన దంపతులకు కామెంట్ల ద్వారా మీ విషెస్ తెలియజేయండి.