ఇటీవల థియేటర్లలో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘కాంతార‘. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కాంతార.. కర్ణాటక, తుళు సంప్రదాయాలకు చెందిన భూతకోల నేపథ్యంలో తెరకెక్కింది. ముందుగా కన్నడ వరకే విడుదలైన ఈ సినిమా.. హైలీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. సినిమాలో కంటెంట్ బాగుంటే ఏ భాషలోనైనా విజయం సాధిస్తుందనే విషయాన్ని కాంతార మరోసారి ప్రూవ్ చేసింది. రూ. 20 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా.. విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని దాదాపు రూ. 200 కోట్లకు పైచిలుకు వసూల్ చేయడం విశేషం.
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ మూవీకి క్లైమాక్స్ మెయిన్ ఎలిమెంట్ గా నిలిచిందని చెప్పవచ్చు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారు ఈ కాంతార మూవీని నిర్మించారు. అయితే.. కొద్దిరోజులుగా ఈ సినిమాలోని ‘వరాహ రూపం.. దైవ వరిష్టం..’ పాటకు సంబంధించి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కాంతారలో స్టోరీ, యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ లతో పాటు ‘వరాహ రూపం’ సాంగ్ కూడా చాలా ప్లస్ అయ్యింది. ఈ క్రమంలో వరాహ రూపం పాటను.. తమ ‘నవరసం’ పాట నుండి కాపీ చేశారంటూ కేరళకు చెందిన ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ వారు కోర్టును ఆశ్రయించారు.
అప్పటినుండి ఈ వరాహ రూపం సాంగ్ కాపీ ఇష్యూ సోషల్ మీడియాలో, చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ వారు నెటిజన్స్ మద్ధతు కోరుతూ.. వరాహ రూపం పాటపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. ఈ విషయంపై కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్, ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో కాంతార మూవీకి కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని సమాచారం. వరాహ రూపం పాటను ఇకపై సినిమా, యూట్యూబ్, మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ తో పాటు ఎక్కడ కూడా ప్రదర్శించకూడదని కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశించింది.
తమ నవరస పాట నుండి ఈ వరాహ రూపం పాటను రూపొందించారనే ఆరోపణలతో తైక్కుడం బ్రిడ్జ్ వారు ఆశ్రయించగా.. న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది. ఈ విషయాన్ని తైక్కుడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ వారే తమ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇకపై ఈ మ్యూజిక్ బ్యాండ్ వారి అనుమతి లేకుండా వరాహ రూపం పాటను కాంతార టీమ్ ఎక్కడ ఉపయోగించడానికి వీలు లేదని కోర్టు తేల్చి చెప్పేసింది. భూతకోలం ఆడే వ్యక్తిలో పంజుర్లి దేవత ఆవహించిన సమయంలో ఈ పాట సినిమాలో వస్తుంది. అదీగాక కాంతార సినిమా ప్రేక్షకాదరణ పొందడంలో ఈ వరాహ రూపం సాంగ్ కీలకపాత్ర పోషించింది. కాబట్టి.. ఇప్పుడీ సాంగ్ ఎక్కడా వాడకూడదని కోర్టు ఆదేశించడంతో చిత్రబృందానికి ఎదురుదెబ్బ పడిందని సినీవర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి కాంతార మేకర్స్ ఈ వివాదంపై ఏమైనా స్పందిస్తారేమో!