కీర్తి సురేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహానటి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకుని.. దేశవ్యాప్తంగా తన ప్రతిభ చాటుకుంది. ఇక కీర్తి సురేశ్‌కి అందమైన రూపంతో పాటు.. అంతకన్నా మంచి మనసు ఉంది. తాజాగా ఆమె చేసిన పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
హీరోయిన్ కీర్తి సురేశ్ మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో అవార్డులు అయితే సాధించింది కానీ ఆమె కెరీర్ మాత్రం ఆశించిన మేర సక్సెస్ కాలేదు. మహానటి తర్వాత మహేష్ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట ఒక్కటే కీర్తి ఖాతాలో హిట్ సినిమాగా నిలిచింది. ఇక ఈ మధ్య బోల్డ్ ఫొటో షోలతో.. గ్లామర్ షోతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నాని సరసన దసరా సినిమాలో నటించింది కీర్తి సురేశ్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కీర్తి సురేశ్ ఎంత అందమైనదో.. అంతకన్నా అందమైన మనసు కల వ్యక్తి. షూటింగ్ సమయంలో తనతో పాల్గొన్న వారికి అపురూపమైన బహుమతులు ఇచ్చి.. వారిపట్ల తన ప్రేమ చాటుకుంటుంది. ఇక తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకుంది కీర్తి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
ప్రస్తుతం కీర్తి తెలుగులో నటిస్తోన్న చిత్రం దసరా. న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల పాత్రలో కనిపించనుంది కీర్తి. తెలంగాణలోని గోదావరిఖని సింగరేణి గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్‌లో నాని, కీర్తి సురేశ్‌ల నటనకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా షూటింగ్ అయిపోయిన సందర్భంగా తనతో పాటు దసరా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చింది కీర్తి సురేశ్.
టెక్నిషియన్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్డ్ కాయిన్‌ను బహుమతిగా ఇచ్చిందట ఈ ముద్దుగుమ్మ. మహానటి తర్వాత మళ్లీ నటనకు స్కోప్ ఉన్న అలాంటి పాత్ర రావడం, షూటింగ్‌లో తనకు అన్ని విధాలా సహకరించినందుకు గానూ.. చిత్రం బృందం అందరికి ఇలా బంగారు నాణెలు గిఫ్ట్‌గా ఇచ్చి వారిపై తన కృతజ్ఞత చాటుకుందట కీర్తి. ఏకంగా 130 మందికి ఇలా గోల్డ్ కాయిన్స్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కీర్తి సురేశ్ మంచి మనసుపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక దసరా సినిమా విషయానికొస్తే.. నేను లోకల్ తర్వాత మరోసారి కీర్తి సురేశ్-నాని జోడిగా నటిస్తున్న చిత్రం ఇది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక సీనియర్ నటుడు సముద్రఖని, సాయికుమార్, పూర్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో మార్చి 30న దసరా రిలీజ్ కానుంది. మరి కీర్తి సురేశ్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.