తెలుగు చిత్ర పరిశ్రమను విషాదాలు వదలడం లేదు. ఒకరి తర్వాత ఒకరు ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగ ప్రేక్షకులకు ఎన్నో అపురూప చిత్రాలు అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం తుది శ్వాస విడిచారు. సామాజిక సమస్యలు, శాస్త్రీయ సంగీతం, నృత్య ప్రాధాన్య చిత్రాలు తెరకెక్కించి.. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు విశ్వనాథ్. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతికిరణం, సప్తపది, స్వాతిముత్యం, శుభలేఖ, స్వయంకృషి, స్వర్ణకమలం వంటి చిత్రాలు ఆయన అభిరుచికి, ఆలోచనా ధోరణికి అద్దం పడతాయి. తెలుగు ప్రేక్షకులకు పది కాలాల పాటు గుర్తుండి పోయే చిత్రాలను తెరకెక్కించిన కళాతపస్వి విశ్వనాథ్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పవచ్చు. విశ్వనాథ్ మృతి నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా విశ్వనాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్విట్ చేశారు.
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి, పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. ‘‘అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు విశ్వనాథ్. దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కారం.. వారి దర్శక ప్రతిభకు నిదర్శనం. తెలుగు సినిమా వున్నన్ని రోజులు కె. విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుంది’’ అంటూ ట్వీట్ చేశారు.
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి, పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు శ్రీ కె. విశ్వనాథ్ అని సీఎం అన్నారు. pic.twitter.com/5nZmJpsDIV
— Telangana CMO (@TelanganaCMO) February 3, 2023
అలానే ‘‘జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః| నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం||(కవి పండితులకు జనన మరణాలు వుండవు. వారి కీర్తి అజరామరం). ఈ వాక్కు విశ్వనాథ్ గారికి అక్షరాలా వర్తిస్తుంది’’ అన్నారు కేసీఆర్.
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః|
నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం||(కవి పండితులకు జనన మరణాలు వుండవు. వారి కీర్తి అజరామరం.)
ఈ వాక్కు విశ్వనాథ్ గారికి అక్షరాలా వర్తిస్తుంది: సీఎం శ్రీ కేసీఆర్
— Telangana CMO (@TelanganaCMO) February 3, 2023
ఇక కేసీఆర్.. దర్శకుడు విశ్వనాథ్‌కు వీరాభిమాని. ఆయన చిత్రాలంటే కేసీఆర్‌కు ఎంతో అభిమానం. విశ్వనాథ్‌తో కేసీఆర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ స్వయంగా విశ్వనాథ్ ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడటమే కాక తన మనసులో కోరిక కళాతపస్వికి తెలిపారు కేసీఆర్. ఆ వివరాలు.. 2018 అసేంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక.. విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. 2019 ఆగస్టు 12న విశ్వనాథ్ ఇంటికి వెళ్లిన కేసీఆర్.. ఆయన కుటుంబంతో చాలాసేపు గడిపారు.
‘‘నేను మీ అభిమానిని. చిన్నప్పటి నుంచీ మీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మీరు తీసిన ప్రతీ సినిమా నేను చూశాను. శంకరాభరణం సినిమాను అయితే ఏకంగా 25 సార్లకు పైగా చూసి ఉంటాను. మీ సినిమాలన్నింటిని అలాగే చూశా. మీ సినిమా చూసిన ప్రతీసారి మిమ్మల్ని ఓసారి కలవాలనిపించేది. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది’’ అని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక ఈ సందర్భంగా తన మనసులో కోరిక విశ్వనాథ్‌కు తెలిపారు కేసీఆర్.
కేసీఆర్..‘‘మీరు తీసే ప్రతీ సినిమా ఓ దృశ్యకావ్యంలాగా ఉంటుంది. సినిమా తీయడం అంటే మీ దృష్టిలో తపస్సు కిందే లెక్క. అంత శ్రద్ధ, ఏకాగ్రతతో తీస్తారు. అందుకే ఇప్పటికీ నాకు ఏమాత్రం తీరిక దొరికినా మీ సినిమాలు చూస్తాను. మీపై ఉన్న నాకున్న ఎనలేని అభిమానమే నన్ను మీ దగ్గరకి తీసుకొచ్చింది. మీ సినిమాలు రాక ఇప్పటికి పదేళ్లయింది. సందేశాత్మక సినిమాలు ఈ మధ్య రావడంలేదు. మీరు మళ్లీ సినిమా తీయాలి. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. దయచేసి దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయండి’’ అని కోరారు కేసీఆర్. కానీ.. ఆయన కోరిక తీరకుండానే కళాతపస్వీ కన్నుమూశారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.