బిచ్చగాడు 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్స్ సమయంలో.. బిచ్చగాడు షూటింగ్‌లో తాను భారీ ప్రమాదానికి గురైనట్లు విజయ్ ఆంటోని వెల్లడించారు. ఇక తాను కూడా పెను ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చింది హీరోయిన్ కావ్య థాపర్. ఆ వివరాలు..
విజయ్ ఆంటోని హీరోగా, కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం బిచ్చగాడు 2. మే 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయ్యింది. బిచ్చగాడు చిత్రం మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కి.. అనూహ్య రీతిలో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే టైటిల్‌తో వచ్చిన బిచ్చగాడు 2 చిత్రంపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శుక్రవారం ఈ సినిమా తెలుగు, తమిళంలో విడుదల అయ్యింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. విజయ్ ఆంటోని ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడ్డట్లే అంటున్నారు. ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ సందర్భంగా విజయ్ ఆంటోని పెను ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే హీరో మాత్రమే కాక.. హీరోయిన్ కావ్య థాపర్ కూడా చాలా పెద్ద ప్రమాదం బారిన పడింది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చానని చెప్పుకొచ్చింది. ఇంతకు ఏంజరిగింది అంటే..
బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోని.. అపస్మారక స్థితికి గురయ్యాడు. దాంతో అతడు ప్రయాణం చేస్తోన్న బోటు నుంచి సముద్రంలో పడిపోయారు. ఆ సమయంలో కావ్య థాపర్ తనను రక్షించిందని ఆంటోని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. తాజాగా ఈ ప్రమాదంపై కావ్య థాపర్ స్పందిస్తూ.. బిచ్చగాడు సినిమా షూటింగ్ సమయంలో తాను కూడా పెను ప్రమాదానికి గురయ్యానని.. చావు అంచుల వరకు వెళ్లొచ్చానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా కావ్య థాపర్ మాట్లాడుతూ.. ‘‘ప్రమాదం జరిగిన వెంటనే విజయ్ ఆంటోనీ సముద్రంలో పడిపోయారు. ఆయన్ని రక్షించాలనే తపనతో నేనూ సముద్రంలో దూకాను. ఈత కొడుతూ వెళ్లి ఆయన్ని పట్టుకున్నాను. ఆ సమయంలో నేను కూడా మరణం అంచుల దాకా వెళ్లినట్టు అనిపించింది’’ అని ప్రమాదాన్ని గుర్తు చేసుకుంది.
‘‘మా పరిస్థితి గమనించిన వెంటనే యూనిట్ మా వద్దకు వచ్చి రక్షించారు. ఆ ఘటనను ఇప్పుడు తలుకున్నా తీవ్రంగా భయం వేస్తోంది. ఆ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో నా ముఖానికి గాయాలయ్యాయి’’అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కావ్య సాహసంపై ఫ్యాన్స్, నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం కావ్య థాపర్ పేరు చిత్ర పరిశ్రమలో జోరుగానే వినిపిస్తోంది. ‘ఫర్జీ’, ‘బిచ్చగాడు 2’ చిత్రాల తర్వాత.. కావ్య థాపర్.. మాస్ మహారాజా రవితేజ సరసన నటించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే సందీప్ కిషన్ కు జోడీగా ‘ఊరు పేరు బైరవకోన’ సినిమాలోనూ నటించింది.