సినీ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో కరాటే కళ్యాణిది ఒక ప్రత్యేకమైన స్థానం. కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా, సామాజిక సమస్యలపై కూడా ఆమె తన గొంతుకను బలంగా వినిపిస్తుంటారు. అన్యాయానికి గురైన వారి పక్షాన నిలబడుతూ వారి కోసం పోరాటం చేయడానికి ఆమె వెనకడుగు వేయరు. సినిమాల్లో బోల్డ్ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కళ్యాణి బిగ్‌బాస్ 4 ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కళ్యాణి తన మాటలతో తరచూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె పెళ్లిపై, సహజీవనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న కళ్యాణి తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యింది. అంతేకాక.. మంచి వ్యక్తి ఎదురుపడితే.. తాను ఇప్పుడు కూడా పెళ్లికి సిద్ధమంటోంది కరాటే కళ్యాణి.
ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘భార్య అంటే వంటింటికే పరిమితవ్వాలి. భర్త ఏం చెప్తే అది చేయాలి.. అతడి మాటకు ఎదురు మాట్లాడకూడదు అనుకునేవాళ్లు ఈ కాలంలో కూడా చాలామంది ఉంటారు. కానీ నేను అలా కాదు. ఫైర్ లాంటి దాన్ని. నిప్పును ఎవరు అరచేతితో ఆపేయలేరు కదా. నిప్పుని ఎంతసేపని పట్టుకుంటారు. అందుకే వదిలేశారు. నేను కరెక్ట్‌గానే ఉన్నాను అనుకున్నా.. కానీ అది వారికి తప్పు అనిపించిందేమో. అలా మనస్పర్థలతో గొడవలు, అనుమానాలు. అలాంటి జీవితం నాకు నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. ప్రస్తుతానికి నాకు నచ్చినట్టు నేను సంతోషంగా జీవిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రేమ, పెళ్లిళ్లు తనకు కలిసిరావని, ఇప్పటి వరకు తనకు నిజమైన ప్రేమ దొరకలేదని కళ్యాణి వాపోయింది.
‘ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నారు. అందుకే ఇప్పటికీ నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తి ఎదురుపడితే పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నా. సరైన వ్యక్తి నా జీవితంలోకి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికైనా.. లేదంటే సహజీవనానికైనా నేను రెడీ. ఎందుకంటే నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్నా. కానీ ఇప్పటికి ఆ కోరిక తీరలేదు’ అని వాపోయింది కళ్యాణి. అంతేగాక తన మాజీ భర్తల వల్ల చాలా కష్టాలు పడ్డానంది.
‘నా మాజీ భర్తలు తరచూ తాగోచ్చి కొట్టడం చేస్తుంటే భరించలేకపోయేదాన్ని. పైగా నాపై వారికి అనుమానం ఎక్కువ. నేను చేయని తప్పుకి మాటలు పడమంటే ఎలా పడతాను. తప్పంతా నాదే అంటే ఎలా కుదురుతుంది. అందుకే విడాకులు తీసుకున్నాను’ అంది. కానీ జనాలకు ఇవేం పట్టవు. నేను పడ్డ కష్టాలు ఎవరు పడి ఉండరు. అలంటి కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డాను. ఒకానోక సమయంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవాలని నిర్ణయించుకుని ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఒకసారి పది నిద్రమాత్రలు తీసుకున్నా.. అయినప్పటికీ బతికి బయటపడ్డాను. దేవుడు నన్ను కాపాడాడు అంటే ఇంకా నేను చేసేదో ఏదో ఉందన్నమాట అని ఆలోచించి ధైర్యంగా నిలబడ్డాను. పది మందికి సాయం చేస్తూ ఇలా ఒంటిరిగా జీవిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది కళ్యాణి.