కెరీర్లో ఎన్నో సీరియళ్లు, సినిమాల్లో నటించానని, ఈ క్రమంలో పలుమార్లు బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయని నటి కరాటే కల్యాణి అన్నారు. ఇంకా ఆమె చెప్పారంటే..!
టాలీవుడ్ ప్రముఖ నటి కరాటే కల్యాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాల్లో, సీరియళ్లలో ఆమె నటించి ఆడియెన్స్‌ను అలరించారు. దాదాపుగా 120కి పైగా మూవీస్‌లో యాక్ట్ చేసిన కల్యాణి.. హరికథ కళాకారిణి కూడా కావడం విశేషం. సుదీర్ఘ కాలం హరికథ చెప్పినందుకు ఆమెకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. తనదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ఆమె ఆరితేరారు. అయితే ఇన్నేళ్ల కెరీర్లో కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు చాలా బాధపడ్డానని ఆమె చెప్పారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్యాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో పాత్రలను బట్టి ఇలా మాట్లాడొద్దు, అలా మాట్లాడొద్దని కొందరు తనను అంటున్నారని.. ఇది సరికాదని ఆమె పేర్కొన్నారు.
‘నేను గతంలో నటించిన పలు క్యారెక్టర్లను చూపుతూ చాలా మంది నువ్వు ఇలా మాట్లాడొద్దని నన్ను అంటున్నారు. నేను భారతీయురాలిని. రాముడి గురించి లేదా ఇంకెవరి గురించైనా, ఏ విషయంపై అయినా మాట్లాడే హక్కు నాకుంది. అప్పుడు చేసిన క్యారెక్టర్లు ఇప్పుడు చేయకూడదనే సినిమాలకు దూరంగా ఉంటున్నా. కెరీర్ కొత్తలో సీరియళ్లలో నటించా. చిత్రాల్లో నటిస్తే ఫేమ్ వస్తుందని అటువైపుగా ప్రయత్నించా. ఈ క్రమంలో వల్గారిటీ ఉన్న పాత్రలకు అంగీకరించా. అయితే వల్గారిటీ తక్కువ ఉంటుందన్నాకే వాటికి ఒప్పుకున్నా. అప్పట్లో ఇండస్ట్రీలో ఎవరి మద్దతు లేకపోవడంతో ఆ దారిలో వెళ్లా. ఒక సినిమాలో అలీతో నటించే సీన్లో చాలా ఇబ్బందిపడ్డా. చీర కొంగును జార్చే సన్నివేశం చేయడానికి మనసు ఒప్పుకోలేదు. అయితే ఒకటే ఫిక్స్ అయ్యా. నేను కాకపోతే ఇంకొకరికి ఆ పాత్ర వచ్చి ఫేమ్ అవ్వొచ్చు. అందుకే అదే దారిలో వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని కరాటే కల్యాణి చెప్పుకొచ్చారు.