సినీ నటి కరాటే కళ్యాణి గురించి తెలుగు ఇండ్రస్టీలో తెలియని వారుండరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. మా ఎన్నికలు నుండి మొన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రూపొందిన పరి అనే ప్రైవేట్ ఆల్చమ్‌పై ఫిర్యాదు చేయడం వరకు పరిశ్రమ బయట, లోపల ఆమె పేరు మారుమోగుతూనే ఉంది. అవే కాకుండా పిల్లలను అక్రమంగా దత్తత తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
ఇటీవల ఆమె తిరుమల దర్శనం నిమిత్తం తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించి.. తనకు ఎదురైన పలు సమస్యలను లేవనెత్తారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణం చేయనివ్వడం లేదంటూ నటి కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండపై తిరుమల దర్శనానికి వెళితే.. గోవిందా.. గోవిందా అని దేవుని నామస్మరణ చేస్తుంటే.. ఎందుకు అరుస్తున్నారని అంటున్నారని, మెల్లిగా పలకమంటున్నారని చెప్పారు. దేవుణ్ని మొర పెట్టుకునేందుకు ఇక్కడకు వచ్చామని, కానీ గోవిందా అనకుండా మా గొంతు నొక్కుతున్నారని, ఇది చాలా బాధా కరమైన అంశమని చెప్పారు.
అదేవిధంగా ఇక్కడ టిటిడి ఉద్యోగుల పెత్తనం సాగుతుందని, ఇక్కడ ఒక్క ఉద్యోగి కూడా తిరునామం పెట్టడం లేదని, ప్రతి ఒక్క ఉద్యోగి సాంప్రదాయ వస్త్ర ధారణ ధరించడం లేదన్నారు. తిరునామం పెట్టకపోతే ఉద్వాసన పలుకుతామని చెప్పాలని, మీరు చెప్పకపోతే తాము చెబుతామన్నారు. మీరు అన్యమతస్థులైనా సరై.. హిందూ దేవుళ్లను గౌరవించాలని అన్నారు. లేకుంటే వారిని తప్పించాలని, వెంకటేశ్వరుని అవమానిస్తే ఊరుకునేది లేదని, దాని కోసం పోరాటం చేస్తానన్నారు. తిరుమలలో ఇబ్బందిగా అనిపించిన కొన్ని విషయాలపై టిటిడి ఛైర్మన్ ధర్మారెడ్డికి వినతులు సమర్పించామన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తిరుమల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నామని, సేవ్ తిరుమల హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తామన్నారు. అలిపిరి వద్ద కొబ్బరి కాయల వ్యాపారం దందా , ప్రైవేటు ట్యాక్సీల మాఫీయా నడుస్తోందని అన్నారు. భక్తులపై రౌడీయిజం చేస్తున్నారన్నారు. భక్తులకు రక్షణనివ్వరా అని ప్రశ్నించారు. ఇవన్నీ దేవుడ్ని దూరం చేసే పనులని అన్నారు. హోటల్స్, ఆహారం విషయంలో కూడా రేట్లు ఇష్టాను సారంగా నడుస్తున్నాయన్నారు. ఇక్కడ ధరల పట్టిక లేదని పేర్కొన్నారు. వాటర్ బాటిల్ రేట్లు కూడా అధికంగా ఉన్నాయన్నారు. ఓ కుటుంబం తిరుమలకు వస్తే వాటర్ బాటిళ్లకే బోలెడంత ఖర్చు పెడుతున్నారని అన్నారు.
ఇక్కడ ప్రసాదంలో నాణ్యత లేదని, డ్రోన్ విషయంపై కూడా ఆమె స్పందిస్తూ తొలుత అదేమీ లేదన్న టిటిడి, ఆ తర్వాత ఎవరి పేరో చెప్పి ఫైన్ వేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. వకుళ మాత ఆలయంలో చోరీ జరిగిందని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ధర్మారెడ్డికి విన్నవించారు. ఉద్యమించక ముందే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలన్నారు. లేకుంటే హైందవ సంఘాలన్నీ పోరాటం చేస్తాయన్నారు. ధర్మారెడ్డిని కలుద్దామంటే.. ఆయన దొరకడం లేదంటూ వాపోయారు. తానొక వినతి పత్రం ఇచ్చానని, మా ప్రయత్నం తాము చేశామన్నారు. మా పరిస్థతి ఇలా ఉందంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు.