కరాటే కల్యాణి– యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి వివాదం ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. అసభ్యకర ప్రాంకులు చేస్తున్నాడంటూ శ్రీకాంత్ రెడ్డిని కరాటే కల్యాణి నిలదీయడం. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం దాడులు చేసుకోవడం తెలిసిందే. ఆ కేసు తర్వాత పిల్లల దందా అంటూ కల్యాణిపై ఆరోపణలు రావడం చూశాం. తర్వాత అవి కేవలం ఆరోపణలు మాత్రమే అంటూ కరాటే కల్యాణికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ గ్యాప్ లో మీడియా ఛానల్స్ తో శ్రీకాంత్ రెడ్డి లైవ్ డిబేట్లకు హాజరయ్యి.. అందరిపై నోరు పారేసుకోవడం కూడాఅందరికీ తెలిసిందే. అయితే ఆ వివాదం అక్కడితో ముగిసిపోయిందని అంతా భావించారు.
కానీ, అప్పుడు చెప్పిన విధంగానే కరాటే కల్యాణి సదరు అసభ్యకర ప్రాంక్ లు, యూట్యూబ్ ఛానల్స్ పై న్యాయ పోరాటానికి దిగింది. ముందే చెప్పినట్లుగా అలాంటి యూట్యూబ్ ఛానల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు 20కి పైగా ఛానల్స్ పై సీసీఎస్ పోలీసులకు సాక్షాలతో సహా ఫిర్యాదు చేసింది. కరాటే కల్యాణి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఐటీ యాక్ట్ లోని 67A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అతి త్వరలో సదరు యూట్యూబ్ ఛానల్స్ కు నోటీసులు జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా సదరు యూట్యూబ్ ఛానల్స్ పై నిఘా పెట్టారు. విచారణ కోసం ఓ ప్రత్యేక టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు. కరాటే కల్యాణి- శ్రీకాంత్ రెడ్డి వివాదంతో యూట్యూబ్ లో అగ్లీ ప్రాంక్ వీడియోలు, అసభ్యకర కంటెంట్ పై సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కరాటే కల్యాణి యూట్యూబ్ ఛానల్స్ పై ఫిర్యాదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.