అతడో స్టార్ కమెడియన్. కోట్లాది మంది ఫ్యాన్స్ అతడి సొంతం. అయినా సరే కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఇంతకీ ఏం జరిగింది?
మనం చూసేది నిజమని చాలాసార్లు భ్రమ పడుతుంటాం. మిగతా వాటిలో ఏమో కానీ సెలబ్రిటీల విషయంలో మాత్రం ఇలానే అనుకుంటూ ఉంటాం. అయితే వాళ్లలో చాలామంది లైఫ్.. బయటకు కనిపించినంత అందంగా ఉండకపోవచ్చు. అలాంటి వాటి గురించి సదరు నటీనటులు ఏదైనా ఓ సందర్భంలో బయటపెడితే, అప్పుడు మనం సింపతీ చూపిస్తాం. అసలు అలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అని బాధపడతాం. ఇప్పుడు కూడా ఓ స్టార్ కమెడియన్, హోస్ట్ తన జీవితంలో ఫేస్ చేసిన దారుణమైన స్థితి గురించి చెప్పుకొచ్చాడు. ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకోవాలి అనిపించిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక విషయానికొస్తే.. ‘ది కపిల్ శర్మ షో’ అనగానే చాలామంది టక్కున గుర్తుపట్టేస్తారు. కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న ఈ షో.. నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అందరినీ ఎంటర్ టైన్ చేస్తూ వస్తోంది. ఇక కపిల్ శర్మకు ఈ షోతో చాలా అంటే చాలా ఫేమ్ వచ్చింది. కావాల్సినంత డబ్బుతో పాటు ఎంతోమంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అయినప్పటికీ తాను ఓ సమయంలో ఒంటరితనాన్ని అనుభవించానంటూ కపిల్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఓ టైంలో చాలా మానసిక సంఘర్షణకు లోనయ్యానని దానిని ఎలా అధిగమించాలో అర్థం కాక.. ఐదేళ్ల క్రితం ఆత్యహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
‘అప్పట్లో నా ఫీలింగ్స్ ని పంచుకోవడానికి నా పక్కన ఎవరూ లేరనిపించింది. అయితే ఇదేం నాకు కొత్త కాదు. మానసిక ఒత్తిడి గురించి అవగాహన లేని ప్లేస్ నుంచి నేను వచ్చాను. చిన్నప్పుడు ఎన్నోసార్లు మెంటల్ గా చాలా డిస్ట్రబ్ అయ్యాను. ఆ టైంలో ఎవరూ నా బాధని గుర్తించలేదు. డబ్బు సంపాదించడం కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు.. నా గురించి పట్టించుకునేవారు ఎవరూ లేకపోయేసరికి.. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎదుటి వ్యక్తుల ఉద్దేశాలు అర్థం కాకపోవడంతో ఒంటరిగా అనిపించింది. నటీనటులకు ఇలాంటివి మరింత ఎక్కువగా ఉంటాయి. అలా 2017లో అత్మహత్మ చేసుకోవాలనుకున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత.. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అయితే జీవితంలో ఎన్నో కష్టాలు ఫేస్ చేసిన తర్వాత బాధ, సంతోషం ఏదైనా సరే కొంతవరకే ఉంటాయని అర్థమైంది’ అని కపిల్ శర్మ చెప్పుకొచ్చాడు.