కాంతార.. భారతీయ సినీ చరిత్రలో ఓ సంచలనంగా మారింది. ప్రకృతితో మనిషికి ఉండే అనబంధం.. దాన్ని అతిక్రమిస్తే.. తలెత్తే పరిణామాల గురించి కాంతార చిత్రం ద్వారా దర్శకుడు రిషబ్ శెట్టి నటించి.. చూపించిన విధానం సంచలనంగా మారింది. సినిమా చూసిన వారిలో చాలా మంది.. ఇది ఓ క్లాసిక్ చిత్రం.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్యులు మొదలు.. సెలబ్రిటీల వరకు చాలా మంది.. కాంతార సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. క్లైమాక్స్ అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ విజయం సాధించి.. వందల కోట్లు వసూలు చేసింది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ విడుదల చేశారు. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలో తన జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాల గురించి వివరించాడు రిషబ్ శెట్టి. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఆసక్తి. ఊరిలో నాటకాలు వేసేవాడిని. అందురూ మెచ్చుకుంటే.. మా నాన్న మాత్రం బాధపడేవారు. అక్కడే ఉంటే నా జీవితం గాడి తప్పుతుందని భావించి.. బెంగళూరు పంపించాడు. అక్కడ నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి శిక్షణ పొందేవాడిని. ఖర్చుల కోసం వాటర్ క్యాన్‌లు వేసేవాడిని. ఇలా సాగుతుండగా.. ఓ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసే అవకాశం లభించింది. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు పని నేర్చుకోవచ్చు అని చేరాను. అన్ని పనులు చేసేవాడిని. కానీ ఓ సారి సినిమా షూటింగ్ సందర్భంగా దర్శకుడు నన్ను తీవ్రంగా అవమానించాడు. దాంతో సినిమా రంగం నాకు సెట్ కాదని బయటకు వచ్చాను’’ అని వెల్లడించాడు.
‘‘ఆ సమయంలో వాటర్ క్యాన్‌లు వేస్తూ సంపాదించికున్న డబ్బులకు మరి కొంత కలిపి.. హోటల్ వ్యాపారం పెట్టాను. కానీ ఆరు నెలల్లోనే విపరీతమై నష్టాలు వచ్చాయి. ఆఖరికి 25 లక్షల రూపాయల అప్పు మిగిలింది. దానికి వడ్డీలు కట్టేందుకు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. 2012 వరకు అప్పులు కడుతూనే ఉన్నాను. ఇలా కాదనుకుని మళ్లీ సినిమాల్లో ప్రయత్నాలు ప్రారంభించాను. చిన్న చిన్న చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక అప్పుల వాళ్ల బారి నుంచి తప్పించుకోవడం కోసం సినిమాల్లోని వేషాలతోనే బయట తిరిగేవాడిని’’ అని చెప్పుకొచ్చారు.
‘‘ఆ తర్వాత దర్శకుడు అరవింద్ కౌశిక్‌త పరిచయం వల్ల రక్షిత్ శెట్టి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తొలి చిత్రం రిక్కీ కథను సినిమాగా తీశాను. సూపర్ హిట్ అయ్యింది. తరవఆత కిరిక్ పార్టీ, సర్కారి హిరియ ప్రాథమిక శాలే, కాసరగోడు ఇప్పుడు కాంతారా’’ సినిమా అని వెల్లడించాడు రిషబ్ శెట్టి.