ఒకప్పుడు హీరోయిన్‌లు, నటీమణులు పెళ్లి చేసుకోవాలంటే చాలా ఆలోచించేవారు. పెళ్లి తర్వాత కెరీర్ ఉండదనే ఉద్దేశంతో.. చాలా కాలం వరకు వివాహ ప్రస్తావన తెచ్చేవారు కాదు. అయితే ప్రస్తుతం కాలం మారుతోంది. కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా సమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని బలంగా నమ్ముతున్నారు. అందుకే కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న తరుణంలోనే పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. వివాహం అనేది తమ కెరీర్‌కు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆలియా భట్ వివాహం చేసుకోగా.. తాజాగా ఇండస్ట్రీలో మరో సెలబ్రిటీ పెళ్లి జరిగింది. ఆ వివరాలు..
కన్నడ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటి రష్మీ ప్రభాకర్ పెళ్లిపీటలెక్కింది. తన ప్రియుడు నిఖిల్ భార్గవ్‌ను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఏప్రిల్ 25న బెంగుళూరులో వీరి వివాహం జరిగింది. కొంతమంది సెలబ్రిటీలు వీరి పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక తన పెళ్లి గురించి అలాగే కాబోయే వరుడు గురించి ముందుగానే చెప్పుకొచ్చింది రష్మీ.
గతంలో ఓ ఇంటర్వ్యూలో రష్మీ మాట్లాడుతూ.. ‘నిఖిల్ అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాడు. మ్యూచువల్ ఫ్రెండ్స్ కావడంతో తరచూ కలుస్తుండేవాళ్ళం. తర్వాత మేము కూడా మంచి ఫ్రెండ్స్‌గా మారాము. తర్వాత ఒకరి పై ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఫస్ట్ నిఖిల్ ప్రపోజ్ చేశాడు, నేను ఓకే చెప్పేసాను. ఒక నెల క్రితం మా పెద్దలతో ఈ విషయాన్ని చెప్పాము. వాళ్లు ముందు షాకయినా.. ఆ తర్వాత వెంటనే మా పెళ్లికి ఓకే చెప్పారు’’ అని చెప్పుకొచ్చింది.
భర్త గురించి మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్‌లో మేమిద్దరం కలిసి ఆహారపొట్లాలు కూడా పంచాము. ఒక నటిగా పెళ్లయ్యాక నా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కూడా నిఖిల్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని చెప్పుకొచ్చింది. కాగా రష్మీ కన్నడ బుల్లితెరపై ‘మనసెల్ల నేనే’ అనే సీరియల్‌లో కథానాయికగా నటించింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ సీరియల్ నుంచి తప్పుకుంది. పెళ్లి చేసుకున్న రష్మీకి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.