సినిమా నిర్మాణం అంటే ఆశామాషీ విషయం కాదు. ఖర్చుతో పాటు శ్రమతో కూడుకున్న పని. సినిమా నిర్మాణం కోసం ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని రోడ్డున పడ్డ వారు కొందరైతే.. ప్రాణాలు తీసుకున్న వారు మరికొందరు. ప్రస్తుతం నిర్మాణం తాలూకా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె నటిస్తూ, నిర్మిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న ‘ఎమర్జెన్సీ’ సినిమాకోసం తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు. తాజాగా, సినిమా షూటింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సినిమా గురించి చెప్పుకొచ్చారు. బాగా ఎమోషనల్ అయ్యారు. ఆమె తన పోస్టులో.. ‘‘ ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ పూర్తయింది.
ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టాను. ఫస్ట్ షెడ్యూల్ సందర్భంగా డెంగ్యూ బారిన పడ్డాను. చాలా విషయాలను నేను బయటకు పంచుకోలేదు. ఎందుకంటే.. నన్ను ప్రేమించే వాళ్లు బాధపడకూడదు. నన్ను ద్వేషించే వాళ్లకు కూడా ఎటువంటి ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. మీకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. మీరు కలలు కన్న దానికోసం కష్టపడితే అది అవుతుందన్నది అబద్ధం. ఒక్కోసారి మన చేతనైనా దానికంటే ఎక్కువే కష్టపడాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. దాన్ని కూడా సంతోషంగా స్వాగతించాల్సి ఉంటుంది.
అది మీకు ఓ పునర్జన్మ లాంటిది. ఇది నిజంగా చెప్పాలంటే నాకు ఓ పునర్జన్మ. నేనిప్పుడు బాగానే ఉన్నాను. మీరు బాధపడకండి. నాకు మీ ఆశీర్వాదాలు.. ప్రేమ మాత్రమే కావాలి’’ అని పేర్కొన్నారు. కాగా, కంగనా రనౌత్ నటిస్తూ, నిర్మిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న ఎమర్జెన్సీ సినిమా ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ‘ఎమర్జెన్సీ’ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, ఎమర్జెన్సీ సినిమా కోసం కంగనా తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.