కంగనా రనౌత్, అమీర్ ఖాన్‌లు విడిపోవటానికి కారణం హృతిక్ రోషనే అట. స్వయంగా ఈ విషయాన్ని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ మేరకు రెండు స్టోరీలు పెట్టారు.
ఎంత మంచి స్నేహమైనా.. ప్రేమైనా మనస్పర్థలు.. కమ్యూనికేషన్ గ్యాప్‌ల వల్ల పాడవుతూ ఉంటాయి. ఇక, సినిమా ఇండస్ట్రీలో స్నేహాలు, బంధాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివి. ఎంతకాలం ఉంటాయో అస్సలు చెప్పలేము. చిన్నచిన్న కారణాలకు విడిపోవటం సినిమా ఇండస్ట్రీలో సర్వ సాధారణం. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ విషయంలోనూ ఇదే జరిగింది. అమీర్‌తో ఆమె స్నేహం మూన్నాళ్ల ముచ్చటగా సాగి, ముగిసిపోయింది. ఇందుకు కారణం హీరో హృతిక్ రోషన్ కావటం గమనార్హం. ఈ విషయాన్ని కంగనా రనౌతే స్వయంగా చెప్పుకొచ్చారు.
ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రెండు స్టోరీలు పెట్టారు. ఆ స్టోరీలలో..‘‘ అమీర్ సార్‌తో స్నేహంగా ఉన్న ఆ రోజులు అప్పుడప్పుడు నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ రోజులు ఎక్కడికి పోయాయి. ఒక్కటైతే కచ్చితంగా చెప్పగలను. ఆయన నాకు దిశానిర్ధేశం చేశారు. నన్ను ప్రశంసించే వారు. సినిమాల విషయంలో నాకు చాలా సహాయం చేశారు. హృతిక్ నా మీద లీగల్ కేసు వేయటంతో అంతా ముగిసిపోయింది. నేను ఓ వైపు.. ఇండస్ట్రీ మొత్తం ఓ వైపు వెళ్లిపోయాయి’’ అని పేర్కొన్నారు. అమీర్, తనకు మధ్య ఉన్న స్నేహం ముగిసి పోవటానికి హృతికే కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌లు పలు సినిమాల్లో కలిసి నటించారు. కైట్స్, క్రిష్ 3 సినిమాల్లో చేశారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్యా ప్రేమ మొదలైంది. తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఇద్దరి మధ్యా బహిరంగంగా గొడవైంది. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఇక, అప్పటినుంచి హృతిక్ పేరు చెబితే కంగనా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరి, అమీర్‌కు తనకు మధ్య ఉన్న స్నేహ బంధం తెగిపోవటానికి హృతికే కారణమన్న కంగనా మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.