సోషల్ మీడియా ద్వారా ఎందరో వెలుగులోకి వస్తున్నారు. టాలెంట్ ప్రదర్శనకు అదో వేదిగ్గా మారింది. అయితే ఇలా ఓవర్‌నైట్ క్రేజ్ తెచ్చుకుంటున్న వారు ఎక్కువ రోజులు దాన్ని కాపాడుకోలేకపోతున్నారు. కచ్చా బాదమ్ స్టార్ భుబన్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది.
సోషల్ మీడియా పుణ్యమా అని టాలెంట్ ఉన్న చాలా మంది ఫేమస్ అయిపోతున్నారు. అయితే ఇలా వచ్చిన ఫేమ్‌ను నిలబెట్టుకోవడంలో మాత్రం ఫెయిలవుతున్నారు. రాత్రికి రాత్రే వచ్చిన క్రేజ్‌ను తట్టుకుని నిలబడలేకపోతున్నారు. ఇకపోతే.. కచ్చా బాదమ్ పాటను వినే ఉంటారు. అప్పట్లో ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ పాటతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు. ఒక్కపాటతోనే ఎంతో పాపులారిటీ సంపాదించాడీ శెనగల వ్యాపారి. ఆ ఫేమ్‌తో పాటలు పాడుతూ, ప్రదర్శనలతో తెగ బిజీ అయిపోయాడు. వీటి ద్వారా వచ్చిన డబ్బులను వచ్చినట్లే ఖర్చు పెట్టేశాడు.
ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బులతో కారు కొన్న భుబన్.. యాక్సిడెంట్‌తో ఆస్పత్రి పాలయ్యాడు. తన ఊరి జనాలే అనుకుని అడిగిన వాళ్లకు అప్పులు ఇస్తూ పోయాడు. మరోవైపు డబ్బు తరిగిపోతుండటంతో చుట్టాలు దూరమయ్యారు. చివరికి.. జనాల వేధింపులను తట్టుకోలేక సొంతూరిని విడిచి, ఇంటికి దూరంగా అద్దె ఇంట్లోకి చేరి మళ్లీ వేరుశనగ బిజినెస్లోకే దిగాడు. భూబన్ తాజాగా ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. చదువు, లోక జ్ఞానం లేకపోవడంతో తాను మోసపోయానని అందులో వివరించాడతను. అగ్రిమెంట్ పేరుతో ఒక కంపెనీ తనను చాలా మోసం చేసిందని వాపోయాడు. యూట్యూబ్‌లో తాజాగా ఏ సాంగ్ అప్లోడ్ చేసినా తనకు కాపీరైట్ ఇష్యూ వస్తోందని అంటున్నాడు భుబన్.
బాదాం అనే పదం ఉంటే చాలు.. తీసేయాల్సిందేనంటూ యూట్యూబ్ నోటీసులు పంపిస్తోందట. ఓ ఒప్పందం మీద ఏమీ చూసుకోకుండా, తెలుసుకోకుండా సంతకం చేయడమే దీనికి కారణం అని చెప్పుకొచ్చాడు భుబన్. ఇక, ఆయన స్వస్థలం భీర్‌భూం జిల్లాలోని కురల్జూరి గ్రామం. సెలబ్రిటీగా మారాక పలు దఫాలుగా ఆయన దగ్గర నుంచి గ్రామస్తులు డబ్బులు కాజేశారు. యువకుల వేధింపులు భరించలేక 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలో భార్యాపిల్లలతో కలసి అద్దె ఇంట్లోకి మారాడు భుబన్. ఆ ఇంటికి నెలకు రూ.2,700 అద్దె చెల్లిస్తున్నాడు. మళ్లీ వీధికెక్కి పల్లీలు అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. మరి.. భుబన్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.