డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు అరెస్ట్ అవడం సంచలనంగా మారింది. ఆ నిర్మాత నుంచి పోలీసులు భారీగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మన దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారుల్లో డ్రగ్స్ ఒకటి. దీనికి బానిసలై చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్, గంజాయి లాంటి వాటికి బానిసలు అవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో డ్రగ్స్ అమ్మకాలు పెరిగాయని.. యథేచ్ఛగా సరఫరా జరుగుతోందని అనలిస్టులు అంటున్నారు. ఒకప్పుడు పంజాబ్ లాంటి ఒకట్రెండు రాష్ట్రాలకు పరిమితమైన డ్రగ్స్.. ఇప్పుడు కోరలు చాచి దేశమంతా వ్యాపిస్తుండటం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. సినీ రంగానికి కూడా డ్రగ్స్ భూతం పాకింది. కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్‌ను వాడటంతో పాటు వాటిని సరఫరా కూడా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
డ్రగ్స్ వాడకం, సరఫరా, విక్రయం ఆరోపణలపై పలువురు సెలబ్రిటీలు పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతుండటాన్ని న్యూస్‌లో చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో తాజాగా మరో సినీ ప్రముఖుడు అరెస్ట్ అవడం సంచలనంగా మారింది. ప్రముఖ ప్రొడ్యూసర్ కేపీ చౌదరీని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్లుగా గోవాలో ఉంటున్న చౌదరి.. ‘కబాలి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు తేలడంతో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీ చౌదరి నుంచి కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠాను పోలీసులు రీసెంట్గా పట్టుకున్నారు. వీళ్ల దగ్గర నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ను వినియోగిస్తున్న కేపీ చౌదరీని అరెస్ట్ చేశారు.