సినిమా అంటే కమర్షియల్ హంగులు తప్పనిసరి. హీరో అంటే ఫైట్లు చేయాలి..పోరాడాలి.. హీరోయిన్ అంటే అంగాంగ ప్రదర్శన చేస్తూ.. పిచ్చి గంతులు వేయాలి అనే అభిప్రాయం ప్రజల మనసులో నాటుకుపోయిన రోజుల్లో.. కథనే హీరోగా మలిచి.. మిగిలిన వారిని పాత్రధారులుగా చేసి.. సినిమా అంటే ఇది కదా అనిపించడమే కాక.. భారీ వసూళ్లు సాధించేలా చేసిన ఘనత కే.విశ్వనాథ్‌ది. తెలుగు సిని చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలు లిఖించుకుని.. దిగ్గజ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు విశ్వనాథ్. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యమే. మరీ ముఖ్యంగా విశ్వనాథ్ దర్శకత్వంలో శాస్త్రీయ సంగీత నేపథ్యంలో వచ్చి.. అవార్డులతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా శంకరాభరణం. తెలుగు సినిమా చరిత్రలో ఈ మూవీ ఓ కలికితురాయి. అంత గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన కళాతపస్వి విశ్వనాథ్ ఫిబ్రవరి 2, 2023 గురువారం రాత్రి.. కన్నుమూశారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిన శంకరాభరణం చిత్రం విడుదలైన రోజునే విశ్వనాథ్ కన్నుమూశారు. కళాతపస్వి మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సినీ రంగంలో కళాతపస్విగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వనాథ్ ప్రస్థానం ఇలా సాగింది. ఈయన 19 ఫిబ్రవరి 1930లో రేపల్లె , మద్రాస్ రెసిడెన్సీలో జన్మించారు. ప్రస్తుతం ఇది ఏపీలో ఉంది. విశ్వనాథ్ బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినప్పటికి.. ఆయన ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. కొన్ని రోజుల తర్వాత విశ్వనాథ్ కుటుంబం విజయవాడకు వెళ్లింది. అక్కడే ఆయన ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారు. కాలేజీ విద్య గుంటూరు హిందూకాలేజీ, ఎ.సి కాలేజీల్లోనూ.. పూర్తి చేశారు.
సౌండ్ రికార్డిస్టుగా చెన్నైలో తన కెరీర్‌ను ప్రారంభించారు విశ్వనాథ్. 1957లో వచ్చిన ‘తోడికోడళ్లు’ సినిమాకు సౌండ్ ఇంజనీర్‌గా పని చేశారు విశ్వనాథ్. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయన పనితనం గమనించిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు.. విశ్వనాథ్‌కు సహాయ దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన దగ్గరే ‘ఇద్దరుమిత్రులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘మూగమనసులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి అక్కినేని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు విశ్వనాథ్.
అలా విశ్వనాథ్‌తో ఏర్పడిన పరిచయం కారణంగా.. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు ఏఎన్నార్. ఆ సినిమా విజయం సాధించినప్పటికి ఆయనకు వెంటనే అవకాశాలు రాలేదు. మొదట్లో కొన్ని కమర్షియల్ చిత్రాలకు డైరెక్ట్ చేశారు విశ్వనాథ్. ఇక ఆయనకు పేరు తెచ్చిన చిత్రం శోభన్ బాబు హీరోగా వచ్చిన చెల్లెలి కాపురం. అప్పటి వరకు హ్యాండ్‌సమ్ లుక్‌తో.. అందాగాడు బిరుదు సంపాదించుకున్న శోభన్ బాబు చేత.. డీగ్లామర్ రోల్‌లో నటింప చేసి.. సినిమాను విజయవంతం చేయడమే కాక విమర్శలుకు ప్రశంసలు కూడా అందుకుంది ఆ చిత్రం.
ఇక ఆతర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శారద, సిరిసిరిమువ్వ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక ఆయన కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం శంకరాభరణం. పాశ్చాత్య సంగీతహోరులో కొట్టుకుపోతున్న తరుణంలో.. సంప్రదాయ సంగీతంలో ఉన్న మాధుర్యం ఎంత గొప్పగా వుంటుందో సమాజానికి తెలియజేసింది ఈ చిత్రం. శంకరాభరణం సినిమా చూసిన తరువాత చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయసంగీతం నేర్పించడానికి ఉత్సాహం చూపించారు అంటే.. ఆ సినిమా ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి జె.వి.సోమయాజులుకు ‘శంకరాభరణం శంకరశాస్త్రి’ గా పేరు స్థిరపడిపోయింది.
ఈ చిత్ర విజయానికి మహాదేవన్ అందించిన సంగీతం, వేటూరి సాహిత్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం, జంధ్యాల కలం నుంచి జాలువారిన మాటలు అన్ని కారణంగానే నిలిచాయి. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాక అవార్డులు కూడా దక్కించుకుంది. ఈ సినిమాకు గాను కేవీమహదేవన్‌కు, దివంగత పద్మవిభూషణ్ బాలుకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా, గాయకుడిగా అవార్డులు లభించాయి.
విశ్వనాథ్ తన కెరీర్‌లో మొత్తం 60 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దేనికదే ఓ ఆణిముత్యం. ప్రస్తుత కాలంలో హీరో అంటే దైవాంశసంభుతుడు. తనకు సాధ్యం కానిది అంటూ ఏది లేదు అనే భావం బలంగా నాటుకుపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో హీరో మానసిక వికలాంగుడు అయితే ఎవరైనా ఒప్పుకుంటారా.. ఆ సినిమా విజయం సాధిస్తుందా.. అంటే లేదు అంటాం. కానీ వీటన్నింనిటిని పటాపంచాలు చేశారు విశ్వనాథ్. ఆయన దర్శకత్వంలో.. కమల్ హాసన్‌తో చేసిన స్వాతి ముత్యం సినిమానే ఇందుకు నిదర్శనం. ఈ సినిమా ఎంత గొప్పది అంటే.. ఆస్కార్ బరిలో భారత అధికారిక ఎంట్రీగా ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. కమల్ ఇందులో పండించిన అమాయక నటన తర్వాతి కాలంలో చాలా మంది హీరోలు ఫాలో అయి సక్సెస్ సాధించారు.
అలానే విశ్వనాథ్ చేసిన మరో సాహసం.. సిరివెన్నెల. ఈ చిత్రంలో హీరోకి చూపు ఉండదు.. హీరోయిన్‌కి మాట ఉండదు. ఇలాంటి కథతో నేటి కాలంలో సినిమా ఊహించుకోగలమా.. కానీ విశ్వాథ్ మాత్రం.. ఇదే కథతో సిరివెన్నెల చిత్రం తీసి విజయం సాధించారు. ఈ సినిమాలో గుడ్డివాడిగా సర్వదమన్ బెనర్జీ , మూగ అమ్మాయిగా సుహాసిని నటన మనం ఇప్పటికీ మరచిపోలేం. ఈ సినిమాతో పాటల రచయత దివంగత సీతారామశాస్త్రి ఇంటి పేరు ‘సిరివెన్నెల‘గా మారిపోయింది. అక్కినేని వంటి హీరోని గంగిరెద్దుల వాడిగా చూపించినా.. మెగాస్టార్ చిరంజీవిని చెప్పులు కుట్టుకునే వ్యక్తిగా మార్చిన ఆ ఘనత విశ్వనాథ్‌దే.
ఇక్కడ తెర మీద మనకు ఆయా హీరోలు కనిపించరు. కేవలం కథ మాత్రమే కనిపిస్తుంది. ఇక సమాజంలో వేళ్లూనుకుపోయిన సమస్యలపై కూడా విశ్వనాథ్ సినిమాలు తెరకెక్కించారు. సప్తపది, సూత్రధారులు, శుభలేఖ, వంటి చిత్రాలు ఆయన అభిరుచికి అద్దం పడతాయి. భారతీయ సాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.
విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణానికి జాతీయ పురస్కారం, సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. అలానే స్వాతిముత్యం సినిమా 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందింది. భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను విశ్వనాథ్‌కు పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది ప్రభుత్వం. ఇక విశ్వనాథ్ దర్శకుడిగానే కాక.. నటుడిగా కూడా ఎన్నో గొప్ప పాత్రలు పొషించారు. ఇక ఆయన సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన శంకరాభరణం సినిమా రోజునే విశ్వనాథ్ కన్నుమూయడం మాత్రం దైవ సంకల్పమే అంటున్నారు అభిమానులు. కళాతపస్వి సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.