ప్రముఖ టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. 92 ఏళ్ల వయసులో వయో భార అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం పంజాగుట్ట శ్మశాన వాటికలో బంధుమిత్రులు, అభిమానుల అశ్రు నయనాల మధ్య జరిగాయి. అయితే, విశ్వనాథ్ అంత్యక్రియల విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. తెలుగు సినిమాకు ఎంతో సేవ చేసిన వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
కే విశ్వనాథ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని అందరూ భావించారు. ఎందుకంటే.. విశ్వనాథ్‌కు సీఎం కేసీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. ఓ సారి కేసీఆర్.. విశ్వనాథ్ ఇంటికి కూడా వెళ్లారు. ఆయన్ని పరామర్శించారు. ఈ సంగతి పక్కన పెడితే.. సినిమా రంగంలో కే విశ్వనాథ్ విశేషమైన కృషి చేశారు. ఎన్నో దేశీయ అవార్డులు, బిరుదులను సొంతం చేసుకున్నారు. భారత సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. అలాంటి ఆయనకు తప్పకుండా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని అనుకున్నారు.
అయితే, అలా జరగలేదు. సర్వ సాధారణంగా విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కొంత అసంతృప్తికి గురయ్యారు. ఓ గొప్ప వ్యక్తిని సరైన విధంగా ప్రభుత్వం గౌరవించలేదని మండిపడుతున్నారు. దానికి తోడు తమిళనాడులో ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. వాణీ జయరామ్ భౌతిక కాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సందర్శించారు. నివాళులు అర్పించారు. తమిళనాడులో సినీ ప్రముఖులకు అక్కడి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం తెలుగు నాట ఇవ్వటం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా కళా, ఇతర రంగాల్లో విశేషమైన సేవ చేసి, మరణించిన వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఆయా రాష్ట్రాల మీద ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా నిర్వహించాలన్న రూలేమీ లేదు. ఇక, తెలంగాణలో ప్రభుత్వం చాలా మంది సినీ ప్రముఖుల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించింది. అయితే, గత కొన్ని నెలల నుంచి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం నిజాం మునిమనవడు అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. నిజం సంస్థానాన్ని పాకిస్తాన్‌లో కలపటానికి చూసిన వారి వారసులకు ఏ విధంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారంటూ ప్రతి పక్షాలు తప్పు బట్టాయి.
రాజకీయంగా ఈ విషయం పెను దుమారాన్ని రేపింది. దీంతో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు బ్రేక్ ఇచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. మరి, ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలీదు. ఇక, సినిమా రంగం నుంచి చివరగా ప్రముఖ నట దిగ్గజం కైకాల సత్యనారాయణకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. మరి, ప్రముఖ టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరక్కపోవటంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.