సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలగాలని కలలు గంటూ ఆ రంగుల ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలతో ప్రాణాలు వదిలనవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఘటనే మరోటి హైదరాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిలింనగర్ జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న సదరు జూనియర్ ఆర్టిస్ట్‌కు కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. దాంతో ఇద్దరూ కొంత కాలం సహజీవనం చేశారు. కానీ, అతడు మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.
ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది.. తనను మోసం చేయవద్దని వేడుకుంది అనురాధ. కానీ కిరణ్ మాత్రం వేరే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పడంతో మనస్తాపానికి గురైన అనురాధ ఆత్మహత్య చేసుకుంది. అనురాధ గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకోగా ఫ్యానుకు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేహం కనిపించింది.
అనురాధ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కిరణ్‌తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో కలిసి నివసిస్తోందని కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేకే అనురాధ బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడు కిరణ్‌పై ఐపీసీ 306, 509, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.