స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగటం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా గొడవలు పడ్డం జరుగుతోంది. అయితే, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని హీరోలు చెబుతూనే ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీలో స్టార్ల మధ్య హెల్తీ కాంపిటీషన్‌ను ఉండటం సహజం. అయితే, దీన్ని స్టార్ల ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అనవసరమైన రాద్దాంతాలు చేస్తూ గొడవలకు దిగుతూ ఉన్నారు. స్వయంగా హీరోలే తమ మధ్య గొడవలు ఏమీ ఉండవని చెబుతున్నా.. కొంతమంది పిచ్చి ఫ్యాన్స్ మాత్రం తమ పంతాలు వీడటం లేదు. ఇక, అవకాశం ఉన్న ప్రతీసారి స్టార్ హీరోలు తమ మధ్య ఎలాంటి ఈగోలు లేవని చెబుతూనే ఉన్నారు. మరో స్టార్ హీరో సినిమా తమకు ఎంతో ఇష్టం అని చెబుతూ ఉన్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవిని పొగడ్తలో ముంచెత్తారు. చిరంజీవి సినిమాల్లో తనకు ‘రుద్రవీణ’ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నాకు ‘దాన వీర సూర కర్ణ’ సినిమా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. అది మహాభారతం నుంచి వచ్చింది. కర్ణుడు, దుర్యోదనుడి మధ్య స్నేహం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సినిమాలో తాతగారు మూడు క్యారెక్టర్లతో పాటు సినిమాకు డైరెక్షన్ కూడా చేశారు. అంతేకాదు! కర్ణుడు, దుర్యోదనుడి మధ్య ఫిక్షనల్ స్నేహాన్ని సృష్టించారు. అందుకే అదంటే నాకిష్టం.
తర్వాత చిరంజీవి గారి రుద్రవీణ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. ఆయన ఓ స్టార్ అయిండి కూడా.. అలాంటి సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. ఓ నటుడికి ఉండాల్సిన తృష్ణ అది. మనలోని నటుడ్ని సంతృప్తి పరచటం చాలా కష్టమైన పని’’ అని పేర్కొన్నాడు. కేవలం జూనియర్ ఎన్టీఆరే కాదు.. నందమూరి ఫ్యామిలీకి చెందిన చాలా మంది కూడా మెగా ఫ్యామిలీలోని హీరోలపై పొగడ్తలు కురిపించారు. రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు సైతం ఉన్నాయి.