తెలుగు ఇండస్ట్రీలో మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను ఎన్టీఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలు పర్యవేక్షిస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా కోట్ల మంది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు సీనియర్ ఎన్టీఆర్. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రక చిత్రాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తెరపై ఎన్నో అద్భుతమైన పాత్రలకు జీవం పోశారు ఎన్టీఆర్. నటుడిగానే కాకుండా తెలుగు వాళ్ల ఆత్మగౌరవం కోసం తెలుగు దేశం పార్టీ స్థాపించి చారిత్రక విజయం అందుకున్నారు. ఈ ఏడాది లెజెండరీ నటడు, మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్ కి ప్రత్యేక ఆహ్వానం అందించారు నందమూరి కుటుంబ సభ్యులు. వివరాల్లోకి వెళితే..
ఆ మద్య విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఉత్సవంలో చంద్రబాబు, బాలకృష్ణ సందడి చేశారు. ఆ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందలేదని.. అందుకే ఆయన వేడుకలో కనిపించలేదని.. కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకుల పై సోషల్ మాద్యమంలో కామెంట్స్ చేశారు. నందమూరి కుటుంబానికి జూ. ఎన్టీఆర్ కి పడటం లేదని.. అందుకే అన్ని విషయాల్లో పక్కన పెడుతున్నారని రక రకాల రూమర్లు వచ్చాయి. వీటన్నింటికి పులిస్టాప్ పెడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, అలాగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టిడి జనార్థన్ నేడు జూ.ఎన్టీఆర్ ని కలిసి మే 20న హైదరాబద్ లో జరిగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానం అందించారు. అదే విధంగా కళ్యాన్ రామ్ కి సైతం ఆహ్వానం అందించారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కార్యక్రమాన్ని సీనియర్ ఎన్టీఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి ఎన్టీఆర్ రాకపోవడం.. దానిపై సోషల్ మీడియాలో జూ. ఎన్టీఆర్ ని దూరం పెట్టార.. పట్టించుకోవడం లేదు.. అనే చర్చలకు పూర్తిగా పులిస్టాప్ పెడుతూ.. ఆహ్వాన పత్రిక అందించారు నందమూరి కుటుంబ సభ్యులు. అలాగే ఎన్టీఆర్ తో పాటు కళ్యాన్ రామ్, దగ్గుబాటి దంపతులతో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులందరికీ ఆహ్వాన పత్రాలు అందజేశారు. మహానటులు ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన ‘శక పురుషుడు సావనీర్’, వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమం కేపీహెచ్ బీ కైతలాపూర్ మైదానంలో మే 20న సాయంత్రం 5 గంటలకు జరగనుంది.