బింబిసార.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి టాక్ నడుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత కల్యాణ్ రామ్ తిరిగి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఇది. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభించేశారు. శుక్రవారం బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కల్యాణ్ రామ్ సోదరుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.
ఈవెంట్ లో సినిమా గురించి, అన్న కల్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ తారక్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు. కల్యాణ్ రామ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తన మాటల్లో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమాని కల్యాణ్ రామ్ కాకుండా మరెవరూ చేయలేరంటూ జూనియర్ ఎన్టీఆర్ తేల్చేశాడు. సినిమా ఎంతో కొత్తగా ఉంటుందని, అందరికీ తప్పకుండా నచ్చుతుందని హామీ ఇచ్చాడు.
ఈ సినిమాపై ఇంత ధైర్యంగా ఉండటానికి ఎంఎం కీరవాణి కూడా ఒక కారణం అంటూ చెప్పకొచ్చాడు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి వెన్నెముక వంటి వాడని తెలిపాడు. ఈ బింబిసారతో అభిమానులు అంతా కాలర్ ఎగరేసుకునేలాగా ఉంటుందన్నాడు. కల్యాణ్ రామ్ కెరీర్ బింబిసారకి ముందు బింబిసారకు తర్వాత అనేలా ఉంటుందని చెప్పాడు. ఈ మాటల్లో తన అన్నపై తారక్ కు ఎంత అభిమానం, ప్రేమ ఉందో తెలిసేలా చేశాడు.
ఇదంతా ఒకెత్తు అయితే ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ తారక్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. థియేటర్లకు జనాలు రావడం లేదని చెబుతున్నారు. కానీ, సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా వస్తారంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా బింబిసారతో పాటుగా ఆగస్టు 5న విడుదలౌతున్న దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ సినిమాని కూడా ఆదరించాలంటూ ఎన్టీఆర్ కోరాడు.
ఎవరైనా తమ సినిమాకి పోటీగా వచ్చే సినిమా పేరు కూడా పలకరు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద సీతా రామం సినిమాని కూడా ఆదరించి.. తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరిని పోయాలంటూ కోరాడు. ఈ ఇండస్ట్రీ పది కాలాల పాటు చల్లగా ఉండి అందరినీ అలరించాలని దేవుడిని కోరుకున్నాడు. ఈ మాటలు విన్న వారంతా అందుకే జూనియర్ ఎన్టీఆర్ ని గొప్ప నటుడు అంటారు ఊరికే కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు. తారక్ స్పీచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.