ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ప్రతిభ ఉన్న నటులు కొందరే ఉంటారు. టాలీవుడ్లో ఉన్న అలాంటి అతికొద్ది మంది యాక్టర్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అందుకే ఆయనకు అంత మంది అభిమాన బలం. ఎన్టీఆర్ నటించే సినిమాలు హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా తెరపై ఆయన నటనను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతుంటారు.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాతో తన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో ఆయన పాపులారిటీ విదేశాలకు పాకింది. ఇందులో అమాయకుడైన ఆదివాసీగా, కొమురం భీమ్ పాత్రలో ఆయన కనబర్చిన నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అలాగే ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంతో ఆయన మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యారు. ఎమోషనల్ సీన్స్‌లో భావోద్వేగాలను పలికించడంలో, ఫైట్లు, డ్యాన్సుల్లో తనదైన మార్క్ చూపిండంలోనూ తారక్‌ది ప్రత్యేకమైన శైలి. ఇదే కోట్లాది మంది అభిమానుల ఆదరాభిమానాలు ఆయనకు దక్కేలా చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చాన్నాళ్లకు ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్టును ప్రకటించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కొత్త మూవీని చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఎన్టీఆర్-కొరటాల కాంబోలో గతంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రం వచ్చిన విషయం విదితమే. అయితే ఈ సినిమాను మించిన స్థాయిలో కొత్త ప్రాజెక్టు తెరకెక్కతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘దేవర’ టైటిల్‌ను మేకర్స్ ఖాయం చేశారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇందులో కత్తి పట్టుకొని ప్రశాంతంగా కనిపిస్తున్న తారక్ లుక్ మామూలుగా లేదు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ నెక్ట్స్ బాలీవుడ్ మూవీలో నటిస్తాడంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘వార్-2’లో తారక్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తాడని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
యుద్ధభూమిలో కలుద్దామంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ జత చేశారు హృతిక్. దీంతో వీళ్ల కాంబో ఫిక్స్ అయిందని అధికారికంగా తేలిపోయింది. అయితే ‘వార్-2’లో తారక్ నెగెటివ్ రోల్లో నటించనున్నట్లు మరో రూమర్ వినిపిస్తోంది. హృతిక్‌కు విలన్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారట. ఆయన పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఎందుకు ఉన్నాయనే దానికి మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఒక బలమైన కారణం ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారని బాలీవుడ్ టాక్. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మూవీ టీమ్ నుంచి అఫీషియల్‌గా ప్రకటన వస్తే గానీ ఏదీ చెప్పలేం. ఈ చిత్రంలో దీపికా పదుకొణే, శర్వారీ వాఘ్లను హీరోయిన్లుగా ఎంపిక చేశారని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మించనున్నారు. కాగా, గతంలో ‘జై లవ కుశ’ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ యాక్ట్ చేసి, ప్రేక్షకులను భయపెట్టిన విషయం విదితమే.
Just In :
Hrithik Roshan confirms collaboration with #JrNTR! #WAR2 pic.twitter.com/uD0fVH1wvp
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 20, 2023