మన దేశంలో సినిమా వాళ్లకు, క్రికెటర్లకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఎవరికి సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా సినిమా వారికి ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అభిమాన హీరో సినిమా విడుదల సమయంలో, ప్రీ రిలీజ్ వేడుకల వేళలో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అలాంటిది ఇక అభిమాన హీరో పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ చేసే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వారిని అదుపు చేయడం పోలీసులు వల్ల కూడా కాదు. గురువారం అర్థరాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. శుక్రవారం (మే 20) ఎన్టీఆర్ 39వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి గురువారం అర్థరాత్రి అభిమానులంతా ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఇంట్లో లేకపోవడంతో.. ఆయన రాకకోసం రోడ్డుపైనే ఎదురుచూశారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు కేక్ కట్ చేసి.. జై ఎన్టీఆర్ అంటూ రోడ్డుపై హంగామ సృష్టించారు.
దీంతో అటువైపు వెళ్తున్న వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసలు..ఎన్టీఆర్ ఇంటివద్దకు చేరుకొని..అభిమానులను పక్కకు తరలించే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ అంతా వెళ్లిపోవాలని ఆదేశించినా.. పట్టించుకోకుండా డాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కొంతమంది అభిమానులను అదుపులోకి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి..లాఠీచార్జ్ చేయడంతో అభిమానులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.