కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడి.. తాను చక్రం తిప్పుతానని భావించిన జేడీఎస్ అధినేత కుమారస్వామికి ఫలితాలు భారీ షాక్ ఇచ్చాయి. ఇది ఇలా ఉండగా ఎన్నిలక రిజల్ట్ రోజునే ఆయన భార్య హీరోయిన్‌గా సినిమా ప్రారంభం కావడం విశేషం. ఆ వివరాలు..
దేశవ్యాప్తంగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో విజయం సాధించి.. కన్నడనాట.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 136 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 65 స్థానాల్లో, జేడీఎస్ 19 చోట్ల విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాలకు ముందు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌లో ఈ సారి కన్నడసీమలో ఏ పార్టీకి మెజార్టీ రాదు, జేడీఎస్ కుమారస్వామి హంగ్‌తో మళ్ళీ చక్రం తిప్పుతాడని చెప్పుకొచ్చాయి. చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా అదే భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ.. కుమారస్వామి జేడీఎస్ ఘోర పరాభవం చవి చూసింది.. త ఎన్నికల్లో 37 సీట్లు గెలిచి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన జేడీఎస్ ఈ సారి కేవలం 19 సీట్లకే పరిమితం అయ్యింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన రోజే.. ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి భార్య రాధికా కుమారస్వామి హీరోయిన్‌గా కొత్త సినిమా ప్రారంభం కావడం విశేషం. కుమారస్వామికి రాధిక రెండో భార్య అన్న సంగతి తెలిసిందే. కన్నడలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన రాధిక.. కుమారస్వామితో పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. ఈ క్రమంలో తాజాగా రాధిక హీరోయిన్‌గా కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ నటుడు, పుష్ప సినిమా హిందీ వెర్షన్ అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పడే హీరోగా, రాధిక కుమారస్వామి హీరోయిన్‌గా ‘అజాగ్రత్త’ అనే కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది. శనివారం రామానాయుడు స్టూడియోలో ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాను ఏడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో జేడీఎస్ పార్టీ అధినేత కుమారస్వామి భార్య, నటి రాధిక కుమారస్వామి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు నేను నిర్మాతగా ఉండాల్సింది. కానీ నేను హీరోయిన్‌గా ఫిక్స్ అవుతాను అని అనుకోలేదు. ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎవరూ సెట్ అవ్వడం లేదని దర్శకుడు కంగారు పడుతూ ఉంటె నేనే నా డేట్స్ కావాలా.. అని అడిగాను. ఆయనను కథ చెప్పమని అడిగి, స్క్రిప్ట్ విన్నాక షాక్ అయ్యాను. చాలా ఏళ్ల తరువాత మంచి కథతో ఇలా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు, డైరెక్టర్ శశికి ధన్యవాదాలు’’ అని తెలిపారు. అయితే ఇలా భర్త ఘోరంగా ఓడిపోయిన రోజే భార్య హీరోయిన్ గా సినిమా ఓపెనింగ్ జరగడంతో కర్ణాటకలో ఈ వార్త కన్నడ మీడియాలో వైరల్‌గా మారింది.