స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అయితే ఈసారి ఆమె ఒక్కరే రాలేదు. ప్రియుడు శిఖర్‌తో కలసి వెంకన్నను దర్శనం చేసుకున్నారు. మిగతా వివరాలు మీ కోసం..
దివంగత నటి, అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రియుడు శిఖర్ పహారియాతో కలసి వెంకన్నను దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంప్రదాయ దుస్తుల్లో తిరుమలకు విచ్చేసిన జాన్వీ కపూర్.. ఆలయం ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ భక్తిశ్రద్ధల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జాన్వీ ప్రియుడు శిఖర్ కూడా పంచెకట్టులో దర్శనమివ్వడం విశేషం. వీళ్లిద్దరూ గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎయిర్‌పోర్టులో కూడా ఇద్దరూ జంటగా కనిపించారు.
జాన్వీ కపూర్-శిఖర్ పహారియాలు ప్రేమలో ఉన్నారని రూమర్స్ వస్తున్న నేపథ్యంలో తిరుమలకు జంటగా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం వాటికి మరింత బలమిస్తోంది. అదే సమయంలో నీతా అంబానీ కల్చరల్ ఈవెంట్‌కు శిఖర్.. బోనీ కపూర్‌తో కలసి వెళ్లాడు. దీంతో వీరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్వరలోనే జాన్వీ-శిఖర్ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు బీటౌన్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే గానీ ఏదీ చెప్పలేం. ఇదిలాఉండగా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రంలో జాన్వీ హీరోయిన్గా ఫిక్స్ అయిన విషయం విదితమే. ఎన్నాళ్లుగానో తారక్‌తో కలసి నటించాలని అనుకుంటున్న జాన్వీ.. మొత్తానికి తన కలను నెరవేర్చుకుంటున్నారు. అదే సమయంలో శ్రీదేవి కూతురును తెలుగు సినిమాలో చూడాలనుకుంటున్న ఆమె ఫ్యాన్స్‌కు కూడా ఈ మూవీతో కలతీరబోతోందని చెప్పొచ్చు.