తెలుగు ప్రేక్షకుల మదిలో సత్యభామగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జమున కన్నుమూసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం.. హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగు వెండి తెరపై కొన్నేళ్ల పాటు యువరాణిలా రాణించిన జమున.. ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు, తమిళ్లో సుమారు 180కిపైగా చిత్రాల్లో నటించిన జమున.. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇక వయోభారం కారణంగా మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆమె సినిమా కెరీర్ లో అనేక మరుపురాని ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ సినిమా సన్నివేశంలో ఎన్టీఆర్ ను జమున కాలితో తన్నడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమున 1936 ఆగష్టు 30 న కర్ణాటక రాష్ట్రంలోని హంపీలోజన్మించారు. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. తండ్రి ఒక వ్యాపారవేత్త. జమున బాల్యం అంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. సినీనటుడు జగ్గయ్యదీ కూడా జమున గ్రామమే. అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర అగ్ర నటుల సరసన హీరోయిన్‌గా నటించారు. జమున తన కెరీర్‌లో ఎన్ని పాత్రలలో నటించినప్పటికి.. ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్రం.. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలోని సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించారు జమున. వినాయకచవితి చిత్రంలో మొదటి సారి సత్యభామ పాత్రలో కనిపించారు జమున.
ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్రలో నటించి.. తెలుగువారికి సత్యభామ అంటే జముననే అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలానే గుడసు పాత్రలంటే కూడా అందిరికి గుర్తుకొచ్చేది జమున పేరే. మిస్సమ్మ సినిమాలోని ఆమె అమాయకత్వం, అల్లరినటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటిస్తే సత్యభామగా జమున నటించారు. ఆ పాత్రలో భాగంగా కృష్టుడిని ఆమె కాలితో తన్నే సీన్ లో నటించగా.. ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యకమైంది. అయితే పాత్ర కోసమే తాను అలా చేసినట్లు జమున వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఆ వివాదాన్ని పక్కన పెడితే.. అప్పటికి ఇప్పటికీ సత్యభామ అంటే జమునే గుర్తొస్తుంది. మరి.. జమున సినీ కెరిర్ లో జరిగిన ఈ మరవలేని ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.