అలనాటి నటి, వెండితెర సత్యభామ జమున ఇటీవల కాలంచేసిన విషయం తెలిసిందే. ఒక్క టాలీవుడ్ లోనే తమిళ్, కన్నడ, హిందీలో అద్భుతమైన చిత్రాల్లో నటించి జమున అభిమానులను మెప్పించారు. మహానటి సావిత్రి తర్వాత అంతటి డిమాండ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి జమున అని అందరికీ తెలిసిందే. మహానటి పేరుతో వచ్చిన సావిత్రి బయోపిక్ చూసి ఈకాలం ప్రేక్షకులకు కూడా సావిత్రి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు జమున విషయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అవును.. జమున బయోపిక్ తీసేందుకు సిద్ధమవుతున్నట్లు సినిమా వర్గాల్లో టాక్ నడుస్తోంది.
అందాల తార జమున జీవితం, ఆమె సినిమాలు, నటనలో ఆమె గొప్పతనం ఇలా ఎన్నో విషయాలను ఈ తరానికి తెలియజేసేందుకు జమున బయోపిక్ తీసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని చెబుతున్నారు. అయితే అది టాలీవుడ్ లో కాదు.. తమిళనాట జమున బయోపిక్ చేసేందుకు ఓ స్టార్ డైరెక్టర్ సిద్ధమవుతున్నారంట. మహానటి తరహాలో జమున బయోపిక్ కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాలని చూస్తున్నారట. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. తమిళ సినిమా వర్గాల్లో వార్తలు జోరందుకున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ ని కూడా ఓకే చేసుకున్నారని చెబుతున్నారు.
ఈ సినిమాలో నటించేందుకు మిల్కీ బ్యూటీ తమన్నాని సంప్రదించినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు తమన్నా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. మహానటి సినిమాతో కీర్తీ సురేశ్ కు ఎంతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు జమున బయోపిక్ తో తమన్నా కూడా మంచి పేరు, అవకాశాలు దక్కించుకోవచ్చనే ఆశాభావంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తమన్నా మెగాస్టార్ చిరంజీవి- మెహర్ రమేశ్ కాంబోలో వస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జమున బయోపిక్ విషయం నిజమే అయితే తమన్నాకు మళ్లీ వెనుకటి క్రేజ్ వస్తుదంటూ కామెంట్ చేస్తున్నారు.