తెలుగు వారికి రాముడు, కృష్ణుడు అనగానే.. ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో.. సత్యభామ అనగానే జమున గుర్తుకు వస్తారు. సత్యభామ పాత్రలోని పొగరు, వగరును.. తనలో పలికించి.. సత్యభామ అంటే.. జమున అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి సుమారు 180కి పైగా చిత్రాల్లో నటించారు జమున. పొగరు, వగరు, వయ్యారం వంటి భావాలు ప్రదర్శించాలి అంటే జముననే తీసుకోవాలి అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏళ్ల పాటు.. ఇండస్ట్రీలో.. ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య వంటి స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గా నటించి.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు జమున. తెలుగు సినీ పరిశ్రమలో లెజెండరీ నాయకిగా గుర్తింపు తెచ్చుకున్న జమున.. శుక్రవారం ఉదయం.. హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అయితే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన జమునపై.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు మూడేళ్ల పాటు బ్యాన్ విధించారు. మరి దీని వెనక గల కారణాలు ఏంటి.. అంటే..
జమున అంటే.. పొగరు, పెద్దలకు గౌరవం ఇవ్వదు.. లేట్‌గా వచ్చినా సారీ చెప్పదు అని ప్రచారం ఉండేదట. ఈ క్రమంలోనే తలెత్తిన ఓ వివాదం కారణంగా.. రామారావు, ఏఎన్నార్‌లు.. తమ చిత్రాల్లో జమున యాక్ట్ చేయదని పత్రికాముఖంగా ప్రకటన ఇచ్చారు. ప్రస్తుత కాలంలో.. ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ప్రకటన ఇస్తే.. ఇక ఆ హీరోయిన్ కెరీర్ ముగిసిపోతుంది. కానీ జమున మాత్రం.. ఈ ప్రకటనను ఏమాత్రం ఖాతరు చేయలేదు. మీరు చేయకపోతే ఏంటి.. అంటూ కాంతారావు, జగ్గయ్య, హరినాథ్ వంటి వారి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి.. వరుస విజయాలు అందుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు బ్యాన్ చేసినప్పటికి.. ఆమె చేతిలో 5-6 సినిమాలకు తగ్గకుండా ఉండేవి అంటే.. జమున క్రేజ్ ఏలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఈ వివాదం గురించి జమున.. ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘‘ఆత్మాభిమానంతో ఉంటే పొగరు, యాటిట్యూడ్ అంటూ ఏవో పేర్లు పెడతారు. నా విషయంలో కూడా అలాగే జరిగింది. సెల్ఫ్ రెస్పెక్ట్ కారణంగా నాగేశ్వరావుతో పెద్ద వివాదమే జరిగింది. బీ కేర్ ఫుల్.. నా జోలికి రావద్దు అనే లెవల్ వరకూ వివాదం వెళ్లింది. ఏ రంగంలో అయినా సరే.. ఓ స్త్రీ ఆత్మాభిమానంతో ఉంటే.. ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొవాల్సి వస్తుంది. అప్పటికే నా గురించి రకరకాల విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. పొగరుబోతుది, కాలు మీద కాలు వేసుకుంటుంది, సమయానికి రాదు, ఆలస్యంగా వచ్చినా సారీ చెప్పదు.. ఇలా చాలా రకాలుగా నా గురించి ప్రచారం చేశారు. ఈ వివాదం పెరగడంతో.. ఒకరినొకరం బ్యాన్ చేసుకున్నాం. మూడేళ్ల పాటు.. మా మధ్య ఈ వివాదం కొనసాగింది’’ అంటూ చెప్పుకొచ్చారు జమున.
అయితే తమ మధ్య వచ్చిన భేదాలను గుండమ్మ కథ.. ముగించింది అని చెప్పుకొచ్చారు జమున. చక్రపాణి గుండమ్మ కథ అనుకున్నప్పుడు.. సరోజ పాత్రకు నన్నే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఓ రోజు చక్రపాణి.. మా ఇంటికి వచ్చి.. మా నాన్నతో మాట్లాడారు. కాంప్రమైజ్ కావాలని.. క్షమాపణ పత్రం రాసిస్తే.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు జమునతో నటిస్తారని చెప్పాడు. అందుకు నేను.. మా నాన్న కూడా ఒప్పుకోలేదు. మా అమ్మాయి తప్పు లేనప్పుడు క్షమాపణలు చెప్పడం ఏంటని ప్రశ్నించారు’’ అని గుర్తు చేసుకున్నారు జమున.
ఇక ఆతర్వాత ఓ రోజు చక్రపాణి.. ఇలా అయితే లాభం లేదనుకుని .. అక్కినేని, ఎన్టీఆర్, జమున ముగ్గురినీ కూర్చోబెట్టి, చనువుకొద్దీ వారిని మందలించి ‘‘అందరూ కలిసి పనిచేయండి. అవతల నా గుండమ్మ ఏడుస్తోంది’’ అంటూ చమత్కరించి సమస్యను తనదైన శైలిలో పరిష్కారం చేశారు అని చెప్పుకొచ్చారు . తర్వాత వీరి కాంబినేషన్‌లో ‘గులేబకావళి కథ’, ’పూజాఫలము’ చిత్రాలు ఘనవిజయం సాధించడంతో వారి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి. అలా సెల్ఫ్ రెస్పెక్ట్‌కు ప్రతీకగా నిలిచారు జమున.