తెలుగునాట ఓ ప్రభంజనం సృష్టించిన కామెడీ షోలలో ‘‘బజర్థస్త్’’ ప్రముఖమైనది. ఈ షో గత 10 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అంతేకాదు! ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు బుల్లితెరపై స్టార్‌లుగా వెలుగొందుతున్న చాలా మంది కమెడియన్లను పరిచయం చేసింది కూడా జబర్థస్తే అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక, జబర్థస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్‌లో వినోద్ ఒకరు. ఈయనను వినోద్‌గా కంటే జబర్థస్త్ వినోదినిగానే ఎక్కువమంది గుర్తుపడతారు. షోలో వందల సంఖ్యలో స్కిట్లు చేశారు. వాటిలో 99 శాతం స్కిట్లు లేడీ గెటప్స్ వేసినవి కావటం విశేషం. లేడీ గెటప్‌లో అచ్చం అమ్మాయిలా ఉండే వినోద్‌కు మంచి గుర్తింపు వచ్చింది. జబర్థస్త్‌తో పాటు చాలా షోలలో లేడీ గెటప్స్‌లో దర్శనమిచ్చారు.
వినోద్ ఎక్కువగా చమ్మక్ చంద్ర టీంలో చేసేవారు. చంద్ర జబర్థస్త్‌ను వీడటంతో ఆయనతో పాటే వినోద్ కూడా బయటకు వెళ్లిపోయారు. తర్వాత మాటీవీ, జీ తెలుగులో పలు షోలలో కనిపించారు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఒకప్పటి వినోదినిని, అనారోగ్యం తర్వాత మారిపోయిన వినోద్‌ను పక్కపక్కన పెట్టి ఊహించుకుంటే గుర్తుపట్టడం చాలా కష్టం. తాను ఇలా మారిపోవటానికి గల కారణాన్ని తాజాగా, ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘కొన్ని హెల్త్ ఇష్యూష్ వచ్చి కాస్తా వీక్ అవ్వటం జరిగింది. ఇంతకు ముందు అనుకోకుండా ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పటం జరిగింది.
కాస్త లంగ్ ఇన్‌ఫెక్షన్ వచ్చింది. నేను ఫుడ్ ఇన్‌టేక్ చాలా తక్కువ తీసుకుంటాను. నాన్‌వెజ్ తినను. లంగ్‌లో నీళ్లు వచ్చాయి. వాటిని తీసేశారు. ఆ టెన్షన్‌లో తీసుకునే ఫుడ్ కూడా ఆపేయటం జరిగింది. దాని వల్ల కాస్త వీక్ అయ్యాను. ఇప్పుడు రికవర్ అయ్యాను. చక్కగా మాట్లాడుతున్నాను. తిరగగలుగుతున్నాను. ట్రీట్‌మెంట్ సమయంలో వాకింగ్ కూడా కష్టంగా ఉండింది. 3 నెలల క్రితం ఇది జరిగింది. దేవుడు, ప్రేక్షకుల దీవెనల వల్ల ఆరోగ్యం బాగైంది. హెవీ జర్నీలు, ఏసీలో ప్రయాణాలు, చల్లటి నీళ్లు తాగటం, జంక్ ఫుడ్ తినటం వల్ల ఇలా అయింది. అంతా ఒక్కసారిగా జరిగిపోయింది. రోజూ ఫుడ్ తీసుకోలేకపోవటం వల్ల ఆసుపత్రికి వెళ్లాను. ఎక్స్‌రేలో అంతా తేలింది’’ అని చెప్పుకొచ్చారు.