‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన నటుల్లో మహేష్ ఒకరు. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లిపోయిన ఆయనకు ‘రంగస్థలం’ మూవీతో మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీ పేరే ఆయనకు స్థిరపడిపోయింది. అలాంటి మహేష్ తన పొలిటికల్ కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘జబర్దస్త్’ టీవీ షో ద్వారా పరిచయమైన చాలా మంది నటులు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. వారిలో కొందరు సినిమాల్లోనూ కమెడియన్స్‌గా రాణిస్తున్నారు. సుధీర్ లాంటి మరికొందరు హీరోలుగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ షో ద్వారా సినిమాల్లో బాగా బిజీ అయిన అతికొద్ది మందిలో మహేష్ ఒకరు. ‘రంగస్థలం’ చిత్రంలో మంచి నటన ప్రదర్శించడంతో ఆయన పేరు రంగస్థలం మహేష్‌గా స్థిరపడిపోయింది. అలాంటి మహేష్ తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ గనుక తనకు టికెట్ ఇస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్‌ది చాలా గొప్ప వ్యక్తిత్వం అని, ఆయనతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో కలసి నటించానన్నారు రంగస్థలం మహేష్. మూవీ సెట్స్‌లో ఆయన ఏది తింటారో అదే అక్కడ ఉన్న వాళ్లందరికీ పెట్టించేవారని చెప్పారు. తనది ఈస్ట్ గోదావరిలోని శంఖరగుప్తం అన్న మహేష్.. అక్కడ పవన్ కల్యాణ్‌ను అందరూ చాలా ప్రేమిస్తారని పేర్కొన్నారు. జనసేన కోసం స్థానికంగా పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారని మహేష్ తెలిపారు. దేవుడి దయ వల్ల పార్టీ తరఫున తనకు పోటీచేసే ఛాన్స్ వస్తే కచ్చితంగా నిలబడతానన్నారు. ఇప్పుడు మాత్రం తన ఆసక్తి మొత్తం సినిమాల మీదే ఉందని మహేష్ వివరించారు.