హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఎలా ఫేమస్సో.. నెల్లూరులో చేపల పులుసు అంతే ఫేమస్. బిర్యానీ చేయాలంటే చాలా ప్రొసెస్ ఉంది. కరెక్ట్ చేసే కుక్ ఉండాలే కానీ చేపల పులుసు రెసిపీ చాలా సింపుల్. ఇప్పుడు అంతా పెద్ద ప్రొసెస్ అవసరం లేదు. ఎందుకంటే ‘జబర్దస్త్’ షోతో గుర్తింపు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ.. కొత్తగా ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. నెల్లూరు నుంచి చేపల్ని తెప్పించి మరీ ఎంతో రుచికరమైన పులుసు తయారు చేయిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆర్పీ రెస్టారెంట్ కు సంబంధించి, సుమన్ టీవీ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక పొగలు కక్కే వేడి వేడి అన్నంలో.. నెల్లూరు చేపల పులుసు వేసుకుని తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. మెత్తగా ఉడికిన చేపలు, దానితో పాటే మామిడికాయ ముక్కలు.. అలా అలా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే.. ప్లేట్లు మాత్రమే వేళ్లు కూడా నాకేస్తారు. ఒక్క మెతుకు కూడా మిగలదు. ఇలా కమెడియన్ కిరాక్ ఆర్పీ వల్ల మరోసారి పాపులర్ అయిన ఫేమస్ నెల్లూరు చేపలు పులుసు తయారు చేయడం ఎలా? ఈ రెసిపీ ప్రొసెస్ ఏంటనేది చాలా సింపుల్ విధానంలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఈ స్టోరీ చదువుతున్నప్పుడు ఆకలేయొచ్చేమో జాగ్రత్త!
కొరమీను చేప ముక్కలు, మామిడికాయ ముక్కలు, టమాట ఒకటి, పచ్చిమిర్చి ఆరు, కరివేపాకు రెబ్బలు కొన్ని, రెండు పెద్ద ఉల్లిపాయలు, 100 గ్రాముల చింతపండు, నిమ్మకాయ ఒకటి, కళ్లుప్పు(రాక్ సాల్ట్), ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర
ముందుగా కొరమీను చేప ముక్కల్లో కళ్లుప్పు, నిమ్మరసం వేసి బాగా వాష్ చేయాలి. మరోవైపు చింతపండుని ఓ పాత్రలో నీరు తీసుకుని అందులో నానబెట్టాలి. ఇక ఉల్లిపాయల్ని మరీ అంత చిన్నగా కాకుండా, మరీ అంత పెద్దగా కాకుండా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే టమాటల్ని, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. మామిడి కాయని కూడా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. అయితే చేపల పులుసుని గ్యాస్ స్టవ్, ఇండక్షన్ స్టవ్ పైనే వండొచ్చు. అయితే కట్టెల పొయ్యిపై వెడల్పాటి పాత్రలో వండితే మాత్రం చేపల పులుసు రుచే మారిపోతుందని సుమన్ టీవీ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు.
చేపల పులుసు తయారీ కోసం ముందు కట్టెల పొయ్యిపై మట్టి పాత్ర వేడి చేసుకోవాలి. అందులో ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి. కాస్త ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. అది హీట్ అయ్యాక.. కొన్ని ఆవాలు, స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు వేయాలి. అవి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. కొంతసేపు తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అది ప్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కాసేపటి తర్వాత టమాట ముక్కులు కూడా వేసుకుని బాగా మగ్గేవరకు మూత పెట్టుకోవాలి. కాసేపటి తర్వాత మూత తీసి అందులో పసుపు, చింతపండు రసం వేసుకోవాలి. కారం కూడా ఆరు స్పూన్ ల వరకు వేసుకోవాలి. స్పైసీ కావాలనుకునే వాళ్లు.. మరో స్పూన్ కారం వేసుకోవచ్చు. చిక్కదనానికి సరిపడా నీళ్లు పోసుకుని, గిన్నెపై మూతపెట్టి మిశ్రమం బాగా ఉడకనివ్వాలి. అది పొంగుతున్న టైంలో చెంచాన్నర ఉప్పు వేసుకోవాలి. స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల పాటు ఆ మిశ్రమం బాగా ఉడకనివ్వాలి.
ఇక చేప ముక్కల్ని అందులో వేసుకునే ముందు ఓసారి పులుసులో ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. అదే టైంలో కరివేపాకు కూడా కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే.. పులుసు అంత టేస్టుగా మారుతుంది. అలా పులుసు మరుగుతున్న టైంలో… చేప ముక్కల్ని నెమ్మదిగా వేసుకోవాలి. ఆ ముక్కలు ఒకదానిపై ఒకటి పడకుండా చూసుకోవాలి. గరిటెతో ఒక్కసారి మాత్రమే ఆ చేప ముక్కల్ని పైకి కిందకు కలిపి వదిలేయాలి. ఐదు నిమిషాల తర్వాత మామిడి ముక్కుల్ని వేసి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత చేపల పులుసుని దాదాపు 15 నిమిషాలకు పైగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో గిన్నె పట్టుకుని కాస్త తిప్పుకోవాలి తప్పితే గరిటె అస్సలు పెట్టకూడదు. పొరపాటున గరిటె పెడితే మాత్రం చేప ముక్కలు విరిగిపోతాయి. అలా బాగా ఉడికిన చేపల పులుసుని దింపే ముందు కొత్తిమీర తరుగుని కాస్త చల్లుకోవాలి. అంతే టేస్టీ టేస్టీగా తయారైన చేపల పులుసు రెడీ. నెల్లూరు చేపల పులుసుకు చేప ముక్కలు ఎంత ఇంపార్టెంటో.. మామిడికాయ ముక్కలు కూడా అంతే ముఖ్యం! పైన చెప్పిన చేపల పులుసు ప్రొసెస్ అంతా కూడా కేజీ చేప ముక్కల వరకు మాత్రమే. దానికంటే ఎక్కువ పరిమాణంలో చేయాలనుకుంటే మాత్రం కొలతలు మారే ఛాన్సు ఉంటుంది. నెటిజన్స్ గమనించగలరు. మరి కిరాక్ ఆర్పీ వల్ల మరోసారి పాపులర్ అయిన నెల్లూరు చేపల పులుసు తయారీ గురించి చెప్పాం కదా.. మరి మీరెప్పుడు చేపల పులుసు చేస్తున్నారు? మమ్మల్ని ఎప్పుడు భోజనానికి పిలుస్తున్నారు!
3rd ఫేజ్, వాటర్ ట్యాంక్ ఎదురుగా, మంజీరా మెజిస్టిక్స్ హోమ్స్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, హైదరాబాద్.