హరిబాబుపై తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పలు స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. తాజాగా, మరో సారి అతడిపై స్మగ్లింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే మీడియాలో పలు వార్తలు రావటం మొదలైంది.
ప్రముఖ టీవీ షో జబర్థస్త్ కమెడియన్ హరిబాబు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో కీలక పాత్రధారిగా మారిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా హరిబాబుపై మరో స్మగ్లింగ్ కేసు నమోదైంది. దీంతో మీడియాలో అతడిపై పలు వార్తలు వస్తున్నాయి. అయితే, పలు మీడియా సంస్థలు పొరపాటున ఓ వ్యక్తికి బదులు మరో వ్యక్తిని స్మగ్లింగ్ కేసులో పాత్రధారుడిగా మార్చేశాయి. స్మగ్లింగ్ చేసింది ఓ వ్యక్తి అయితే.. మరో వ్యక్తి ఫొటోలు పెట్టి వార్తలు రాసేశాయి. ఇంతకీ సంగతేంటంటే.. చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ హరిబాబు జబర్థస్త్‌లో కమెడియన్‌గా పలు స్కిట్లు చేశాడు. అతడిపై నాలుగేళ్ల క్రితం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులు నమోదయయ్యాయి.
ఇక, అప్పటినుంచి అతడు పరారీలో ఉన్నాడు. తాజాగా, ఓ ఎర్ర చందనం స్మగ్లింగ్ ముఠా పోలీసులకు చిక్కింది. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. ఈ ముఠాలో హరిబాబు కీలకంగా ఉన్నాడని పోలీసులకు తెలియవచ్చింది. దీంతో హరిబాబు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే.. ప్రస్తుతం జబర్థస్త్‌లో లేడీ గెటప్స్ చేస్తున్న గంపా హరికృష్ణను.. పరారీలో ఉన్న హరిబాబుగా మీడియా.. సోషల్ మీడియా భావించింది. ఈ మేరకు మీడియాలో వార్తలు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వీటిపై గంపా హరికృష్ణ స్పందించాడు. తాజాగా, ఓ మీడియాతో మాట్లాడుతూ ‘‘ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుంది నేను కాదు.
నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. 2013లో షకలక శంకర్ అన్న టీమ్‌లో వైఎస్ హరిబాబు పని చేశాడు. తర్వాత అతడు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో దొరికాడు. పోలీసుల ఎంక్వైరీలో అతడు జబర్థస్త్ చేసినట్లు కూడా తేలింది. నేను అప్పటికే ఫేమ్‌లో ఉన్నాను. గూగుల్‌లో ఆ పేరు కొడితే నా ఫొటోలు వస్తున్నాయి. మీడియా వాళ్లు గూగుల్‌లో ఆ పేరు కొట్టి.. నా ఫొటోలు తీసుకుంటున్నారు. ఎందుకు రాశారో తెలీదు.. కొన్ని మేయిన్ ఛానల్స్ కూడా నా ఫొటోలు పెట్టి వార్తలు రాశాయి. దీని వల్ల నేను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాను. నాకు దానికి సంబంధం లేదు. నాది నూజివీడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.