సినిమాకు భాషతో సంబంధం లేదు కానీ అందులో నటించే వారికి ఆ భాష కూడా వస్తే ఔట్ ఫుట్ వేరే లెవల్లో ఉంటుంది. కానీ అది చాలా మూవీస్ విషయంలో జరగని పని. తెలుగులోనే తీసుకోండి.. హీరోతో పాటు కొందరు సైడ్ యాక్టర్స్ ని మాత్రమే మన వాళ్లని తీసుకుంటారు. హీరోయిన్ దగ్గర నుంచి విలన్, ఇతర ఇంపార్టెంట్ రోల్స్ కోసం ఎక్కడో ముంబయి, కేరళ, తమిళనాడు నుంచి నటీనటుల్ని తీసుకొస్తారు. వాళ్లకేమో భాష సరిగా రాదు. డైలాగేమో చెప్పలేరు. చెప్పినా సరే కొన్ని పదాల్ని సరిగా పలకలేరు. మరి తెలుగులో అలాంటి నటులు లేరా అంటే.. ఉన్నారు కానీ వాళ్లని సరిగా ఉపయోగించుకునే విషయంలో ఎక్కడో పొరపాటు జరుగుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే… ఇప్పుడంటే అందరూ పాన్ ఇండియా మూవీస్ అని వాటి వెంట పడుతున్నారు. ఒకే సినిమాలో దేశవ్యాప్తంగా పేరున్న నటుల్ని తీసుకుని, అన్ని భాషల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తెలుగులోనే కొందరు అద్భుతమైన నటులు ఉన్నారు. వాళ్లకు ఎందుకో సరైన న్యాయం జరగడం లేదని అనిపిస్తుంది. మిగతా వాళ్ల గురించి కాస్త పక్కనబెడితే.. ఉదాహరణకు ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబునే తీసుకోండి. 500పైగా సినిమాల్లో హీరో, విలన్, నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. కంప్లీట్ యాక్టర్ అనిపించుకున్నారు. టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.
ఎక్కడో తిరుపతికి దగ్గర్లోని మోదుగులపాలెం అనే చిన్న ఊరిలో పుట్టిన భక్త వత్సలం నాయుడు.. డిగ్రీ వరకు చదివారు. నటుడు అవ్వాలనే ఆశ ఉన్నప్పటికీ దానికి చాలా సమయం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు వ్యాయామ ఉపాధ్యాయుడిగానూ పనిచేశాడు. ఇక 1970ల్లో ఓ ఐదేళ్లపాటు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చేసిన ఈయన.. 1975లో దాసరి నారాయణరావు తీసిన ‘స్వర్గం నరకం’తో పూర్తిస్థాయి నటుడిగా మారారు. తన పేరు కూడా మోహన్ బాబుగా మార్చుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 48 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా విలన్ రోల్స్ చేసిన మోహన్ బాబు.. వాటికి తనదైన స్టైల్, మేనరిజమ్స్ జోడించారు. విలన్ కి కూడా మేనరిజమ్స్ పెట్టింది ఈయనే! ఏదేమైనా సరే మోహన్ బాబు లాంటి విలన్.. మళ్లీ రాడు.. లేడు.. భవిష్యత్తులో వచ్చే ఛాన్స్ కూడా లేదు!
ఇక 80ల్లో హీరోతో సంబంధం లేకుండా తెలుగులో విడుదలైన ప్రతి సినిమాలోనూ దాదాపు మోహన్ బాబు కనిపించారు. ఎన్టీఆర్,ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా ఆ టైంలో తెలుగులో ఉన్న ప్రతి ఒక్క స్టార్, యువ హీరోలతో నటించారు. ఇక సోలో హీరోగా మారిన తర్వాత మోహన్ బాబు… విలన్ రోల్స్ చేయడం పూర్తిగా తగ్గించేశారు. బ్రహ్మ, పెదరాయుడు, అల్లరి మొగుడు, అడవిలో అన్న లాంటి సినిమాలతో తానెంటో ప్రూవ్ చేసుకున్నారు. అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగే చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 20వ శతాబ్దం స్టార్టింగ్ లో చేసిన ‘రాయలసీమ రామన్న చౌదరి’ అయితే ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇది ఆయన 500వ సినిమా కావడం విశేషం.
ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో డైలాగ్స్ చెప్పగలడు అనే గుర్తింపుని మోహన్ బాబు తెచ్చుకున్నాడు. కానీ చాలారోజుల నుంచి అడపాదడపా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. గతేడాది ‘సన్నాఫ్ ఇండియా’తో ప్రేక్షకుల్ని పలకరించారు. అది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. అంతకుముందు కూడా కొన్ని సినిమాలు చేశారు గానీ ఆయన పొటెన్షయల్ ని బయటకు మాత్రం తీయలేకపోయాయి. 2007లో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘యమదొంగ’లో యముడిగా కనిపించి ‘భంభోలా జంబ’ అనిపించారు. ఆ తర్వాత నుంచి ఒక్కటి కూడా సరైన రోల్ పడటం లేదు. యంగ్ డైరెక్టర్స్ ఈయనలోని టాలెంట్ ని గుర్తించలేకపోతున్నారా అనే డౌట్ కూడా వస్తుంది.
ఎందుకంటే డైలాగ్స్ అద్బుతంగా చెప్పగలిగే తెలుగు నటులు సినిమాలో ఉంటే వాళ్ల సీనియారిటీ, యాక్టింగ్ ఎక్స్ పీరియెన్స్ మూవీకి చాలా ప్లస్ అవుతుంది. ప్రస్తుత జనరేషన్ దర్శకులు మాత్రం పాన్ ఇండియా అంటూ నార్త్ యాక్టర్స్ వెంట పడుతున్నారు గానీ మన దగ్గరే ఉన్న మోహన్ బాబుని మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో ఓసారి.. ‘నా ఊపిరి ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటాను’ అని స్వయంగా మోహన్ బాబే స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ డైరెక్టర్స్ ఈయనని ఉపయోగించుకోవడంలో ఎక్కడో తడబడుతున్నారు అనిపిస్తోంది. మరి దీనిపై మీరేం అంటారు? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.