జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తెగా, బాలీవుడ్ బ్యూటీగా చాలా మంది అభిమానులనే సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. సినిమా ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నా ఏటా తిరుమల దర్శనానికి మాత్రం తప్పకుండా వస్తుంటుంది. లంగాఓణీ వేసుకుని పదహారణాల తెలుగమ్మాయిలా స్వామివారి దర్శనానికి వస్తుంటుంది. శ్రీదేవి లేని లోటుని జాన్వీ కపూర్‌లో చూసుకునే ఫ్యాన్స్ ఉండనే ఉన్నారు. టాలీవుడ్ అభిమానులు కూడా జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే అందుకు సంబంధించి ఇప్పటివరకు చాలానే వార్తలు వచ్చాయి. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. మొన్నీమధ్య విజయ్ దేవరకొండతో ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ చాలానే వార్తలు వినిపించాయి.
అయితే విజయ్ దేవరకొండతో ఎంట్రీ అనేది అవ్వలేదు. ఆ తర్వాత మరోసారి జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ వైరల్ అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీకపూర్‌ని టాలీవుడ్ ఎంట్రీపై ప్రశ్నించారు. తనకి కూడా ఎప్పటినుంచో తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలని ఉందని చెప్పింది. టాలీవుడ్‌లో ఏ హీరోతో చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. నాకు జూనియర్ ఎన్టీఆర్‌తో చేయడం అంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి మరోసారి టాలీవుడ్ ఎంట్రీ తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ 30లో జాన్వీకపూర్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అవి కూడా పుకార్లే అని తేలిపోయేటట్లు ఉంది.
అవును.. ఎందుకంటే జాన్వీకపూర్ ఎంట్రీ తారక్‌తో కూడా కాదట. ఇప్పుడు తెరపైకి కొత్త హీరో పేరు వచ్చింది. ఇటీవలే రామ్ చరణ్ తర్వాతి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆర్సీ16ని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాలో రామ్ చరణ్‌కి జతగా జాన్వీ కపూర్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మెగా హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు జాన్వీ కపూర్ కూడా రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో కూడా ఎంత వరకు నిజం ఉందనేది చెప్పే పరిస్థితి లేదు. జాన్వీ కపూర్ ఎంట్రీపై మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబో అయితే కన్ఫర్మ్ అయిపోయింది. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఆర్సీ15 సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే.