సీరియల్స్ అనగానే చాలా మందిలో ఓ రకమైన చిన్నచూపు ఉంటుంది. సాగదీస్తారని.. పది నిమిషాల మ్యాటర్‌ని గంట పాటు చూపిస్తారని.. ఓవర్ యాక్షన్, ఆడవాళ్ల పెత్తనం, కుళ్లు, కుతంత్రాలు వంటి అవలక్షాణాలను చూపడం.. కొన్ని విషయాల్లో మరీ అతి చేయడం వంటివి చేస్తారనే భావన సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే ఎవరు ఎన్ననుకున్నా.. ప్రస్తుతం బుల్లితెర మీద సీరియల్స్‌దే హవా. వాటి దెబ్బకు మంచి సినిమాలు, షోలను కూడా ఆ టైమ్‌లో ప్రసారం చేయాలంటే భయపడతారు. ఇక కొన్ని సీరియల్స్ అయితే మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. కొన్ని సీరియల్స్ సమాజంపై ఎంతో ప్రభావాన్ని కూడా చూపాయి. దూరదర్శన్ ప్రారంభైన నాటి నుంచే సీరియల్స్ ప్రస్థానం ప్రారంభం అయ్యింది. మెల్లగా విస్తరించుకుంటూ పోతూ.. ప్రస్తుతం ప్రతి చానెల్‌లో రోజుకు 15 సీరియల్స్ వరకు ప్రసారం చేస్తున్నాయంటే.. వాటికున్న ఆదరణ ఎలాంటిదో అంచాన వేయవచ్చు.
అయితే ఈ మధ్యకాలంలో ప్రసారం అవుతున్న చాలా సీరియల్స్‌లో కనిపించే కాన్సెప్ట్ ఒకటే.. ఒక్క మగాడి కోసం ఇద్దరు ఆడాళ్లు తన్నుకోవడం.. అతగాడిని దక్కించుకోవడం కోసం ఎత్తుకుపైఎత్తులు వేయడం.. లేదంటే అక్రమ సంబంధాలు ఇలాంటి కథలతోనే వస్తున్నాయి. ఇక తెలుగులో వస్తోన్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఈ కోవకు చెందినదే. ప్రేమించి వివాహం చేసుకుని.. ముగ్గురు బిడ్డలను కని.. పాతికేళ్లు కాపురం చేసిన తర్వాత మరో మహిళ మోజులో పడి భార్యకు విడాకులిస్తాడు ఈ సీరియల్‌లో హీరోయిన్ తులసి భర్త.
ఇక అప్పటి నుంచి ఆమె ఒంటరి ప్రయాణం కొనసాగిస్తుంది. భార్య చనిపోయినా.. విడాకులు తీసుకున్న వెంటనే మగాడు రెండో పెళ్లి చేసుకోవచ్చు.. కానీ అదే మహిళ మాత్రం.. అలానే ఒంటరిగా జీవించాలి అనే భావన సమాజంలో ఎలా జీర్ణించుకుపోయిందో.. సీరియల్‌లో కూడా చాలా పాత్రలు అదే ఫీలింగ్‌తో ఉంటాయి. ఇక ఒంటరిగా సాగుతున్న తులసి జీవితంలో స్నేహితుడు సామ్రాట్ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు ఇంద్రనీల్. గతంలో చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ ద్వారా మంచి ఆదరణ సంపాదించుకున్నాడు ఇంద్రనీల్.
ఇక గృహలక్ష్మి సీరియల్‌లో కూడా సామ్రాట్ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. యాక్టింగ్ పరంగా అతడిని తప్పు పట్టలేం. కానీ ఈ సీరియల్ దర్శకుడి తీరు చూస్తే.. త్వరలోనే గృహలక్ష్మి తులసికి, సామ్రాట్‌కి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాడనిపిస్తుంది. దాన్నే ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా సామ్రాట్.. అలియాస్ ఇంద్రనీల్ ఇప్పుడు ఎక్కడ కనిపించినా.. మీరు తులసిని పెళ్లి చేసుకుంటారా.. అలా చేస్తే మామూలుగా ఉండదు.. అని ప్రేక్షకులు సీరియస్ అవుతున్నారట. నందు చేసుకున్నాడు కాబట్టి.. తులసి రెండో పెళ్లి చేసుకున్నా పర్లేదు కానీ.. మరీ ఆమె కొడుకు వయసున్న వ్యక్తిలా కనిపిస్తున్న కుర్రహీరోతో ప్రేమాయణం ఏంటని తిట్టిపోస్తున్నారు. దాన్నే అంగీకరించలేకపోతున్నారు.
మరికొందరు మాత్రం.. నానమ్మ కావాల్సిన వయసులో తులసికి పెళ్లి అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్నారు. పైగా సీరియల్‌లో తులసి పాత్ర వయసు చూస్తే.. 45-50 మధ్య ఉంటుందేమో అనిపిస్తుంది.. కానీ సామ్రాట్ మాత్రం ఆమె పెద్ద కొడుకు కంటే కాస్త పెద్దవాడు అనేలా యంగ్‌గా ఉంటాడు. దాంతో వీరిద్దరికి ప్రేమ, పెళ్లి అని ముడి పెట్టడాన్ని ప్రేక్షకులు అంగీకరించలేకపోతున్నారు. అంతేకాక చాలా మంది డైరెక్ట్‌గా ఇంద్రనీల్(సామ్రాట్)కి ఫోన్ చేసి మరీ.. తులసిని పెళ్లి చేసుకోవద్దని కోరుతున్నారట. ఇటీవల ఓ టీవీ షోలో ఓ మహిళ డైరెక్ట్‌గా సామ్రాట్‌తోనే మీరు తులసి పెళ్లి చేసుకోవద్దు.. ఫ్రెండ్స్‌గానే ఉండండి అని రిక్వెస్ట్ చేసింది.
ఇటీవల దీనిపై ఇంద్రనీల్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈటైమ్స్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండో పెళ్లిపై తన అభిప్రాయన్ని తెలియజేశాడు. ‘‘మనం 2022లో ఉన్నాం.. ఈ సమాజం రెండవ వివాహాన్ని స్వాగతించడాన్ని నేను ఇష్టపడుతున్నాను. పెళ్లైన తరువాత మనసులు కలవకపోతే విడిపోవడం సహజం.. మనసుకి దగ్గరైన ఇష్టమైన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు. రెండవ పెళ్లి అనేది చట్టబద్ధంగా చేసుకుంటే తప్పులేదు.. అదేదో పాపమన్నట్లు.. నిషేదం అన్నట్లు చూడకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ తోడు కావాలి. ప్రతి వ్యక్తికి తన జీవితాన్ని సంతోషంగా గడిపే హక్కు ఉంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి.. తమకి నచ్చిన వ్యక్తితో ఉండటం తప్పేం కాదు.. ఎవరి ఇష్టం వారిది. ఎవర్నైనా ఎంపిక చేసుకోవచ్చు’’ అన్నాడు.
‘‘అలానే ఇప్పుడు నేను నటిస్తున్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో తులసి పాత్ర కూడా ఈ కోవకు చెందినదే. తనకి ఇష్టమైన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడానికి తులసి అర్హురాలు. ఆమె రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పేం లేదు’’ అని చెప్పుకొచ్చాడు సామ్రాట్. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే గృహలక్ష్మికి, సామ్రాట్‌కి ముడిపెట్టేలా ఉన్నాడు దర్శకుడు అంటున్నారు నెటినులు. కాగా ఇంద్రనీల్ రియల్ లైఫ్‌లో సీరియల్ నటి మేఘనా రామీని పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి పలు సీరియల్స్ నటించారు. రొమాంటిక్ రియల్ కపుల్‌గా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు ఇంద్రనీల్, మేఘనాలు.